పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి


Mon,April 22, 2019 02:56 AM

పరకాల, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ తీసుకునే నిర్ణయానికి కార్యకర్తలు, నాయకులు కట్టుబడి ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఆయన నివాసంలో నడికూడ మండల టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు భారీ మెజార్టీని కట్టబెట్టాలన్నారు. పార్టీలో కష్టపడిన వారందరికీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను చాలామంది ఆశిస్తారని, కానీ అందరికీ ఇవ్వలేరనే విషయాన్ని గమనించాలన్నారు. పార్టీ నిర్ణయించిన వారికే టికెట్లు వస్తాయని, వారందరిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. నడికూడ మండలంలో రెండో విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయని, అందరూ కలిసికట్టుగా కృషి చేసి, టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించేలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏదైనా టీఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు. రావాల్సిందల్లా భారీ మెజార్టీయేనని తెలిపారు. అందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో పరకాల నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పులి సారంగపాణి, నడికూడ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...