మోగిన నగారా...


Sun,April 21, 2019 02:07 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ జారీ కావడంతో ఆశావాహుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. స్వరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో జెడ్పీటీసీగా, ఎంపీటీసీలుగా పోటీచేసేదుకు పలువురు తహతహలాడుతున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికలకు విజయవంతంగా పూర్తిచేసిన ప్రభుత్వం, ఎన్నికల అధికారులు జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నికలకు కసరత్తును పూర్తిచేశారు. ప్రతిపక్షాలు కల్పిస్తున్న ఎన్నో అడ్డంకులను, విమర్శలను తిప్పికొడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేశారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లాలోని 16మండలాల్లో ఉన్న 401 గ్రామపంచాయితీల పరిధిలో 178 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 6వ తేదీన మొదటి విడత ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మొదటి విడతలో 5 జెడ్పీటీసీ స్థానాలకు, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 10న రెండో విడత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 63ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 14న మూడో విడత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విడతలో 5 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 53ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 22న మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు మూడు రోజుల గడువు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 16 జెడ్పీటీసీ స్థానాల్లో మొదటి విడతలో 5 స్థానాలకు, రెండో విడతలో 6, మూడో విడతలో 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేక్రమంలో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించేలా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జిల్లాలోని 178 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే అధికారయంత్రాంగం పూర్తిచేసింది. ముందస్తుగా ఎన్నికల కమిషనర్ పలుమార్లు నిర్వహించిన సమీక్షల్లో చేసిన సూచన మేరకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా మొదటి విడతలో వరంగల్ రూరల్ జిల్లాలోని దుగ్గొండి జెడ్పీటీసీ స్థానంతోపాటు 12 ఎంపీటీసీ స్థానాలకు, నర్సంపేట మండల జెడ్పీటీసీతోపాటు 11ఎంపీటీసీ స్థానాలకు, పర్వతగిరి జెడ్పీటీసీ స్థానంతోపాటు 14ఎంపీటీసీ స్థానాలకు, సంగెం జెడ్పీటీసీ స్థానంతోపాటు 14ఎంపీటీసీ స్థానాలకు, వర్ధన్నపేట జెడ్పీటీసీ స్థానంతోపాటు ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో విడతలో కొత్తగా ఏర్పడిన నడికూడ మండల జెడ్పీటీసీతోపాటు 10 ఎంపీటీసీ స్థానాలకు, పరకాల జెడ్పీటీసీతోపాటు ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక శాయంపేట మండల జెడ్పీటీసీతోపాటుగా 12 ఎంపీటీసీ స్థానాలకు, రాయపర్తి మండల జెడ్పీటీసీ స్థానంతోపాటు 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్లబెల్లి మండల జెడ్పీటీసీతోపాటు 11ఎంపీటీసీ స్థానాలకు, ఖానాపురం జెడ్పీటీసీతోపాటుగా 9 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో ఆత్మకూరు జెడ్పీటీసీ స్థానంతోపాటు 9 ఎంపీటీసీ స్థానాలు, కొత్తగా ఏర్పడిన దామెర మండల జెడ్పీటీసీతోపాటు 8 ఎంపీటీసీ స్థానాలు, గీసుకొండ మండల జెడ్పీటీసీ స్థానంతోపాటు 9 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చెన్నారావుపేట జెడ్పీటీసీతోపాటుగా 11 ఎంపీటీ స్థానాలు, నెక్కొండ జెడ్పీటీసీతోపాటుగా 16 ఎంపీటీసీ స్థానాలకు
ఎన్నికలు జరుగనున్నాయి.
ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలుకు అవకాశం..
ఈ సారి ఎన్నికల్లో కొత్తగా ఆన్‌లైన్‌లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రం ప్రింట్‌ను కచ్చితంగా ఎన్నికల అధికారికి అందించాలనే నిబంధన పొందుపరిచారు. దీంతో కార్యాలయాలకు వెళ్లకుండానే నామినేషన్ దాఖలు చేసే సౌకర్యం అభ్యర్థులకు కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తగిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచింది.

సిద్ధంగా ఉన్నాం : కలెక్టర్ ఎం హరిత
రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకా రం ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత తెలిపారు. నోటిఫికేషన్ విడుదలతోపాటు ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, ఎన్నికల సిబ్బందికి అన్ని విడతల్లో శిక్షణను పూర్తిచేసామని చెప్పారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచామని కలెక్టర్ అన్నారు. నామినేషన్ల తుదిగడువు, ఉప సంహరణల తరువాత బ్యాలెట్ పేపర్ల ముద్రణకు కూడా కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయని చెప్పారు. మొదటి విడతలో ఐదు మండలాల్లో, రెండో విడతలో ఆరు మండలాల్లో, మూడో విడతలో ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 16 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెపారు. పోలింగ్ కేంద్రాల్లో తగిన వసతిని కూడా కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్‌లతోపాటు మౌలిక వసతుల పరిశీలన కూడా పూర్తియిందని తెలిపారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...