పల్లెల్లో ప్రాదేశిక పోరు


Sat,April 20, 2019 01:57 AM

- ఏర్పాట్లలో అధికారులు
- సమీకరణల్లో నేతలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెల్లో ప్రాదేశిక ఎన్నికల వాతావరణం వేడెక్కింది. షెడ్యూల్ వెలువడకముందే ప్రాథమికంగా షెడ్యూల్ తేదీలు చర్చకు రావడంతో ఆశావాహులు సమీకరణల్లో నిమగ్నమయ్యారు. నాయకులు సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయంతో ముందుకుసాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు అధికారులు ప్రాథమిక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అటు నాయకులు, ఇటు అధికారులు ఎవరి పనిలో వారు కొనసాగుతున్నారు. వరుస ఎన్నికల బాధ్యతల్లో మునిగితేలుతున్న అధికారులు, నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియతో మరింత బిజీబిజీగా మారారు. అధికారపార్టీ ఇప్పటికే ప్రాదేశిక స్థానాల్లో అభ్యర్థుల ఖరారుకు కసరత్తు చేస్తున్నది. టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గట్టి పోటీ ఉంది. ఒకేస్థానానికి నాలుగు నుంచి ఆరుగురు నాయకులు పోటీపడుతున్న స్థానాలు కూడా ఉన్నాయి. అధికారపార్టీ హవా కొనసాగుతుండగా ప్రజలంతా ప్రతిపక్షాలకు దూరంగా, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా విజయదుందుభికి బాటలు వేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో తీవ్రపోటీ నెలకొంది.

ఈ పోటీలో తనకంటే తనకు టికెట్ ఇవ్వాలంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహులు స్థానిక మండల, జిల్లా నాయకుల, శాసనసభ్యుల గుర్తింపు, సహకారం కోసం ప్రతీరోజు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఓవైపు పల్లెల్లో సమీకరణలు చేసుకుంటూనే మరోవైపు పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లావ్యాప్తంగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అక్కడక్కడ ఓటమిపాలైనవారు, ఎంపీటీసీగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నవారు టికెట్ల విషయంలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకులు టికెట్ల కోసం తిరుగుతుంటే వారి కుటుంబసభ్యులు గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఆశిస్తున్నవారి సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త జిల్లాల, మండలాల, గ్రామపంచాయతీల ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రంలో మొదటిసారిగా ప్రాదేశిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే బూత్‌ల వారీగా సౌకర్యాల పరిశీలనను పూర్తిచేసింది. ఓటరులిస్టుల జాబితాల సవరణలు, ఆర్‌వో, ఏఆర్‌వో, ఎన్నికల సిబ్బంది శిక్షణలను కూడా పూర్తిచేసింది. బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచింది. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. ఓవైపు అధికారులు, మరోవైపు రాజకీయ పార్టీల హడావుడితో గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

కదలికలేని ప్రతిపక్షాలు
జిల్లాలో ప్రతిపక్షాల పరిస్థితి దారుణంగా తయారైంది. టీఆర్‌ఎస్ శరవేగంగా దూసుకుపోతూ సభలు, సమావేశాలు, సమీక్షలతో ప్రాదేశిక అభ్యర్థుల ఖరారు వైపు అడుగులు వేస్తుండగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలలో కదలిక లేకుండాపోయింది. దీంతో ఆ పార్టీ నాయకులు, ఆశావాహులలు అధికారపక్షంవైపు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యులు టీఆర్‌ఎస్‌లో చేరిపోగా వామపక్షాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు రాజకీయ కదలిక లేకుండా కనిపిస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట శాసనసభా నియోజకవర్గాల పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు బాధ్యతలను ఎమ్మెల్యేలకే అప్పగిస్తూ టీఆర్‌ఎస్ నాయకత్వం సూచన చేసింది. దీంతో జిల్లాకు చెందిన మంత్రి దయాకర్‌రావు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిల సమావేశాలు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఆశావాహుల పేర్లను పరిశీలించడంతోపాటు గెలుపుగుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాలలో గ్రామాల వారీగా, మండలాలవారీగా ప్రాదేశిక సభ్యుల వివరాలను తయారుచేసి ఓ నిర్ణయం తీసుకోవడంతోపాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లేందుకు స్థానిక నాయకత్వం కసరత్తు చేస్తున్నది.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...