రూ.20వేలు తీసుకున్నారు..


Sat,April 20, 2019 01:56 AM

పరకాల, నమస్తే తెలంగాణ : విశ్రాంత ఉపాధ్యాయుడికి తన తండ్రి నుంచి సంక్రమించిన భూమితోపాటు తన భార్యకు విరాసత్ కింద వచ్చిన భూమిని నూతన పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకోసం రూ.20వేలు లంచం తీసుకున్నారు. అంతేకాకుండా వారికి చెందిన భూమిలో నుంచి 16గుంటలు తక్కువ చేశారని బాధితుడు ఊరుగొండ నర్సయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫ్యాక్స్‌లో పంపిన లేఖలో పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన ఊరుగొండ నర్సయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన భార్య ఊరుగొండ పద్మ, పద్మ తండ్రి అయిన దార్న చక్రపాణికి మల్లక్కపేట రెవెన్యూ శివారులో 1-12గుంటల భూమి ఉంది. 24 జూలై 2006న ఆయన మరణించారు. దీంతో చక్రపాణి ఏకైక కూతురైన పద్మ తన తండ్రికి చెందిన మల్లక్కపేట రెవెన్యూ శివారులోని 1-12గుంట భూమిని విరాసత్ కింద పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనికి గ్రామ రెవెన్యూ అధికారి సాయిని ముత్యం పట్టా పాస్‌పుస్తకాలు చేయాలంటే రూ.20వేలు ఖర్చవుతుందని అనడంతో వీఆర్‌వో అడిగినదంతా ఇచ్చారు. అనుకున్న ప్రకారం వీఆర్‌వో పద్మ పేరున ఖాతానెంబర్ 479తో పాస్‌పుస్తకం నెంబర్ 115046లో మల్లక్కపేట శివారులోని 285/బి సర్వేనెంబరులో 1-07 (ఒక ఎకరం ఏడు గుంటలు మాత్రమే) పట్టా చేశారు.

పాస్‌పుస్తకం చూసుకున్న నర్స య్య తమ మామ చక్రపాణికి చెందిన 1-12గుంటల భూమికి బదులు 1-07గుంటలు మాత్రమే వచ్చిందని వీఆర్‌వోకు తెలుపగా మీకు మోఖాపై భూమి అంతే ఉంది కాబట్టి పాస్‌పుస్తకంలో 1-07గుంటలు మాత్రమే వచ్చిందని బదులిచ్చాడు. ఇదిలా ఉండగా నర్సయ్య తండ్రి మొండయ్యకు మల్లక్కపేట శివారులో 1-11(ఎకరం పదకొండు గుంటల భూమి కలదు). ఆ భూమి తండ్రి నుంచి నర్సయ్యకు సంక్రమించింది. ఆ భూమికి సంబంధించి పాస్‌పుస్తకం, పహాణీలో పే రు కలిగి ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న భూప్రక్షాళన సమయంలో నర్సయ్యకు చెందిన 1-11గుంటల భూమిని కాస్త 1-00 (ఒక ఎకరం)గా మార్చారు. ఇది తెలుసుకుని వీఆర్‌వో ముత్యంను నిలదీయగా అక్కడ భూమి తక్కువగా ఉన్నదని చెప్పాడు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయగా తహసీల్దార్ ఎదుట పహాణీలో మార్చినట్లు ఒప్పుకున్నాడు. 285/బి సర్వే నెంబర్‌లో 2-23గుంటల భూమి ఉండగా ప్రస్తుతం ఆ భూమి విస్తీర్ణాన్ని 2-07 (రెండెకరాల ఏడు గుంటలకు) మార్చారు. దీంతో ఊరుగొండ పద్మకు ఉండాల్సిన 1-12గుంటలు కాస్త 1-07గుంటలు, ఊరుగొండ నర్సయ్యకు ఉండాల్సిన 1-11గుంటల భూమి ఎకరంగా మారింది. ఎవరు పట్టించుకోకపోవడంతో 16 జనవరి 2018న వరంగల్ రూరల్ ఆర్డీవోకు, 12 మార్చి 2018న గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదుచేశారు. నూతన పాస్‌పుస్తకాలు రాకపోవడంతో తమకు రైతుబంధు కూడా వర్తించలేదన్నారు.

ఇప్పుడున్నట్లయితేనే కొత్త బుక్కులిస్తామంటున్నారు : ఊరుగొండ నర్సయ్య
మల్లక్కపేట శివారులోని 285/బి సర్వేనెంబర్‌లో ఊరుగొండ నర్సయ్య ఎకరం, ఊరుగొండ పద్మకు 1-07గుంటల వరకైతేనే కొత్త పాస్‌పుస్తకాలిస్తాం. కావాలంటే తీసుకో లేదంటే ఊరుకో అని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం. మాకు 1965వ సంవత్సరం నుంచి రికార్డులు ఉన్నాయి. పాత పహాణీ నకళ్లను కూడా చలానా కట్టి మరీ తీసుకున్నాం. అన్నింటిలోనూ మాకు 2-23గుంటల భూమి ఉంది. అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా మాకు న్యాయం జరగడంలేదు. దీనిపై కేసీఆర్‌కు లెటర్ రాశా.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...