పల్లె సారథులు..


Thu,April 18, 2019 01:47 AM

- జిల్లాలో 246 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకం
- పల్లెపాలన సాఫీగా కొనసాగడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
- ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి చర్యలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీమాంధ్రలు పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పల్లెపాలనకు పెద్దపీట వేశారు. భారీగా నిధులు కేటాయిస్తూ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. దీంతో పల్లెల్లో పాలన మెరుగవుతుండడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి నాలుగున్నరేళ్లలో పల్లెల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించింది. క్షేత్రస్థాయిలో పాలనను మెరుగుపర్చాలని భావించింది. గ్రామపంచాయితీ పాలకవర్గంతోపాటు అధికారులను కూడా బాధ్యులను చేస్తే పల్లె పాలన మరింత పరుగులు పెట్టవచ్చని సంకల్పించింది. ఈ మేరకు 2018 పంచాయితీరాజ్ చట్టాన్ని తెచ్చింది. ప్రజల అవసరాలను గుర్తించి పారదర్శకతతో కూడిన పాలనను అందించి ముందుకుసాగేలా చట్టాన్ని తయారుచేయడంతోపాటు పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ చట్టంతో స్థానికంగా ఉండే పాలకవర్గాలు, అధికారులను బాధ్యులను చేసింది. అవినీతి రహిత పాలనకు బాటలు వేసింది. పల్లెపాలన సాఫీగా సాగేలా కార్యాచరణ ప్రభుత్వం రూపొందించింది.

దీంతో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ ప్రగతిపథంలో పల్లెలను నడిపించాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వం అన్నిస్థాయిల్లో అవగాహనను కల్పించింది. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లాలో పంచాయతీల నిర్వహణకు అవసరమైన అంశాలను గుర్తించింది. జిల్లాలోని 16 రెవెన్యూ మండలాల్లో 401 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 120 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన ప్రభుత్వం ఆ వెంటనే జరిగిన కార్యదర్శుల నియామకాల్లో జిల్లాకు 246 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కేటాయించింది. జిల్లావ్యాప్తంగా పాలనను పరుగులు పెట్టించేలా వారికి శిక్షణ ఇచ్చి విధులను అప్పగించింది. వారం రోజులుగా కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) విధుల్లో చేరుతున్నారు.

ప్రజల్లో ఆనందం..
జిల్లాలో కార్యదర్శుల నియామకం పూర్తిచేశారు. కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా విధుల్లో చేరారు. వీరంతా మండలాల్లో రిపోర్టు చేసి పంచాయతీలకు వెళ్లి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామానికి కార్యదర్శి రావడం, ఉత్సాహంగా పనుల్లో పాల్గొంటుండడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. తమ పనులు సులభతరంగా పూర్తవుతున్నాయని చెబుతున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శితో పనిపడితే పట్టణాలకు లేదా పోస్టింగ్ ఉన్న గ్రామపంచాయతీకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య తప్పిందని ప్రజలు చెబుతున్నారు.

నిరుద్యోగుల్లో ఉత్సాహం..
ఇంతకాలం నిరుద్యోగులుగా ఉన్న యువకులు జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు. జిల్లావ్యాప్తంగా కొత్తగా 246 మంది కార్యదర్శుల నియామకం జరిగింది. ఉద్యోగాలు రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...