జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ గెలుచుకోవాలి


Wed,April 17, 2019 02:11 AM

శాయంపేట, ఏప్రిల్ 16 : మండలంలోని అన్ని ఎంపీటీసీలతో పాటు జెడ్పీటీసీని గెలిపించుకోవాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా మంగళవారం మండలంలోని 12 ఎంపీటీసీల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రగతిసింగారం, కాట్రపల్లి, వసంతాపూర్, కొప్పుల, పెద్దకోడెపాక, మాందారిపేట, గట్లకానిపర్తి, శాయంపేట, మైలారం, పత్తిపాక గ్రామాల్లో పార్టీ శ్రేణులతో మధుసూదనాచారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ మండలంలోని ఉన్న అన్ని ఎంపీటీసీ స్థానాలతోపాటు ఎంపీపీ స్థానాన్ని కూడా టీఆర్‌ఎస్ కైవసం చేసుకునేలా కష్టపడాలన్నారు. జెడ్పీటీసీలను గెలిపించుకుంటే జిల్లా పరిషత్ పదవి కూడా టీఆర్‌ఎస్ వశమవుతుందన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేసి ఎక్కువ పంచాయతీలను గెలుచుకున్నారన్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కూడా గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

నష్టం కలిగించే వారిపై దృష్టి ఉంటుందని, తప్పకుండా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టు మరోసారి జరగవద్దని ప్రతి ఓటు టీఆర్‌ఎస్‌కే పడేలా పార్టీ నాయకత్వం చూసుకోవాలన్నారు. ప్రతీ ఎంపీటీసీని, జెడ్పీటీసీని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను స్థానిక నాయకులు తీసుకోవాలన్నారు. ఎక్కడ లోటు పాట్లు, ఇబ్బందులు తలెత్తకుండా శ్రేణులు పనిచేయాలన్నారు. పార్టీ నాయకత్వం సూచించిన అభ్యర్థికి సహకరించాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. స్పీకర్‌గా తాను మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి పల్లె నిద్రలు చేసి అభివృద్ధి పనులు చేశానన్నారు. ప్రజల మధ్యనే ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల ఎన్నికల ఇన్‌చార్జీలు కొంపెల్లి ధర్మరాజు, తాళ్లపెల్లి దామోదర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, రైతు సమితి మండల కన్వీనర్ కర్ర ఆదిరెడ్డి, ఎంపీటీసీ బగ్గి రమేశ్, బాసాని చంద్రప్రకాశ్, వంగాల నారాయణరెడ్డి, కొమ్ముల శివ, నాయకులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...