పర్యావరణ పరిరక్షణ కోసం గోకా రామస్వామి దీక్ష


Wed,April 17, 2019 02:11 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : పర్యావరణ పరిరక్షణ కోసం నర్సంపేట పట్టణంలో వనప్రేమి అవార్డు గ్రహీత, పర్యావరణ వేత్త గోకా రామస్వామి మంగళవారం దీక్ష చేపట్టారు. నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్ ప్రాంతం లో మున్సిపాలిటీ అధికారులు ఆరు సంవత్సరాలుగా చెత్తను డంప్ చేస్తున్నారు. దీంతో వల్లభ్‌నగర్, శాంతివనం, చుట్టుపక్కల ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. వ్యవసాయ బావుల్లోని నీరు మురికిగా మారుతోంది. అన్ని కాలల్లోనూ ఇక్కడ దుర్వాసన వెదజల్లుతోంది. వల్లభ్‌నగర్ ప్రాంత వాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు వ్యవసాయ భూముల వద్దకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. గోకా రామస్వామి వల్లభ్‌నగర్ సమీపంలో శాంతివనం పేరుతో పర్యావరణానికి ఉపయోగపడేలా చెట్లను పెంచుతున్నాడు. అయితే, ఈ ప్రాంతమంతా కలుషితమవుతున్నది. డంపిం గ్ యార్డుతో వర్షాకాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు.

వల్లభ్‌నగర్‌కాలనీవాసుల మద్దతు..
చెత్తను ఇక్కడ డంపు చేయవద్దని జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలకు, మున్సిపల్ చైర్మన్లకు పలువురు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందరో మారుతున్నారు. మారిన అధికారి దగ్గరి వెళ్లి గ్రామస్తులు, పర్యావరణ వేత్త గోక రామస్వామి వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే, ఇక్కడ చెత్త పోయవద్దని ప్రతీసారి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ, వారి ఆదేశాలు బుట్టదాఖలే అవుతున్నాయి. కమిషనర్లు ఎందరు వచ్చినా ఇక్కడే చెత్తను వేస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఈ పరిస్థితి అంటూ గోకా రామస్వామి మంగళవారం నిరసన దీక్షకు దిగారు. చెత్త డంపింగ్ చెరువు వద్ద రోజంతా నిరసన దీక్ష చేపట్టారు. పర్యావరణ వేత్త గోకా రామస్వామికి వల్లభ్‌నగర్ కాలనీ వాసులందరూ మద్దతుగా నిలిచారు. కాలనీవాసులందరూ అక్కడికి చేరుకున్నారు. ఇక్కడి డంపింగ్ యార్డును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

ప్రజాసంఘాల మద్దతు..
గోకా రామస్వామి చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మార్పీఎస్, ఏబీఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఆర్‌టీఏ, మోచీ హక్కుల సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు కల్లెపెల్లి ప్రణయదీప్ మాదిగ, కొమ్ముల సతీశ్, చంద్రగిరి శ్యాం మాట్లాడుతూ శాంతివనం పక్కన మొరం తవ్వకాలు చేపట్టి కొందరు రూ.లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక్కడి డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ డంపింగ్ యార్డును చేపల పెంపకం కేంద్రంగా వాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దిడ్డి పార్థసారథి, బొట్ల నరేశ్, పంజాల రాము, గోపి, శివరాత్రి ఉపేందర్, కందికొండ దేవేందర్, కందికొండ శ్రీను, కల్యాణ్, నాగరాజు, వెంకటేశ్, కృష్ణ, బాబు,రాజు, బాలరాజు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణానికి చెందిన కంభంపాటి ప్రతాప్ తదితరులు కూడా మద్దతు ఇచ్చారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...