బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించరు


Mon,March 25, 2019 02:34 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఆదివారం నర్సంపేటలోని ఆయన గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించామన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణవాణి వినిపించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులనే గెలిపించుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. 70 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వాలు దేశంలో అధికారంలో ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీల వల్ల ఒనగూరిందేమి లేదన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ అంతా వెలిగిపోతోందన్నారు. అందుకే ఆయనపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి బలరాంనాయక్ గతంలో నర్సంపేటలో జరిగిన రైతు భరోసాయాత్ర సభలో ఈ సారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఓట్లేయకుంటే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలుపుతామని మాట్లాడారన్నారు. దీంతో పక్కనే ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా నోరు మూసుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడ్డారన్నారు. అతడికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్‌ను కాపాడుకునే పరిస్థితిలో కూడా లేదన్నారు. అలాంటి పార్టీ తమ మీద అన్ని స్థానాల్లో పోటీకి దింపిందన్నారు. ఆ పార్టీకి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని పెద్ది కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్‌లో వచ్చేనెల 4న జరిగే కేసీఆర్ బహిరంగ సభకు నర్సంపేట నుంచి 50 వేల మందిని తరలిస్తామన్నారు. 28న నర్సంపేట నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత హాజరుకానున్నట్లు వివరించారు. సమావేశంలో నర్సంపేట మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నాయిని నర్సయ్య, నల్లా మనోహర్‌రెడ్డి, దార్ల రమాదేవి,గుంటి కిషన్, మండల శ్రీనివాస్,తూటి శ్రీనివాస్, ఎర్ర యాకూబ్‌రెడ్డి, ఎంపీపీ సారంగపాణి పాల్గొన్నారు.

పెద్ది సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక
చెన్నారావుపేట : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మండలంలోని ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పానుగంటి కొంరయ్య, బాషబోయిన జనార్దన్, పానుగంటి కుమార్‌తో పాటు మరికొంత మంది టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరుతున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల రాజారాం, నాయకులు మంద జనార్దన్, బానోతు గణేశ్, టేకుల స్వామి, ఎదురబోయిన నర్సింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...