ఉరకలేస్తున్న ఉత్సాహం


Sun,March 24, 2019 02:07 AM

- దూకుడుపెంచిన టీఆర్‌ఎస్
- సభలు, సమావేశాలకు సన్నాహాలు
- జోరుగా భారీ చేరికలు
- శ్రేణుల్లో జోష్ నింపుతున్న ఎమ్మెల్యేలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికల్లో అమలుచేసిన వ్యూహాలకు మరింతగా పదునుపెట్టి పార్లమెంటు ఎన్నికల్లో కారుజోరును కొనసాగించేందుకు జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, శాసనసభ్యులు మరోసారి వ్యూహాలకు పదునుపెట్టారు. జిల్లాలోని మూడు శాసనసభా స్థానాలు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు విస్తరించి ఉన్నాయి. మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన టీఆర్‌ఎస్ మరోఅడుగు ముందుకేసి పార్లమెంట్ స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మండలాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిపేందుకు వ్యూహరచన చేసింది. జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించిన వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట శాసనసభా నియోజకవర్గాల్లో అదే మెజారిటీని అందించేందుకు మరోసారి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పార్టీశ్రేణులను కదిలించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దిశ, దశ నిర్ధేశించారు. ఆ సభలో హామీ ఇచ్చిన పరకాల, వర్ధన్నపేట శాసనసభ్యులు, మహబూబాబాద్ సభలో హామీ ఇచ్చిన పెద్ది సుదర్శన్‌రెడ్డి లక్ష మెజారిటీకి తగ్గకుండా ఒక్కో నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అదేక్రమంలో రాష్ట్రపార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమాలోచనలు, సన్నాహక సమావేశాలు జరుపుతున్నారు. అన్నిస్థాయిల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు ముందువరుసలో నిలిచాయి. ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్ స్పీడును చూసి నివ్వెరపోతున్నాయి.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
వరంగల్ రూరల్ జిల్లాలోని మూడు శాసనసభా నియోజకవర్గాలు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ నియోజవకర్గం పరిధిలో ఉండగా నర్సంపేట నియోజకవర్గం మమబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. అక్కడ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, పరకాల, వర్ధన్నపేటల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఒక ప్రవాహంలా వచ్చి చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ నాయకత్వం ఓ భరోసాను కల్పించింది. దీంతో చేరికల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పరకాల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒకేరోజు పార్టీలో చేరడం దీనికి నిదర్శనం.

నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలు
రూరల్ జిల్లాలో ఉన్న మూడు శాసనసభా నియోజకవర్గాల్లో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరకాలలో ఈ నెల 26న నిర్వహించాల్సిన సమావేశాన్ని సమయాభావంతో నేడు (25వ తేదీ) మధ్యాహ్నం 3గంటలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని మరో నియోజకవర్గ వర్ధన్నపేట విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల 26న సాయంత్రం 4గంటలకు నిర్వహించేలా టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డివిజన్, మండలస్థాయి సమావేశాలను కూడా నిర్వహించాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్ పార్టీ. 3వ తేదీన పరకాల డివిజన్‌స్థా యి సమావేశం, 6వ తేదీన వర్ధన్నపే ట డివిజన్‌స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దీనికిగానూ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా మర్రి యాదవరెడ్డి, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పులి సారంగపాణిని నియమించారు.

మండలాల వారీగా సభలు
జిల్లాలో మండలాల వారీగా ప్రచార సభలను కూడా స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ సభల నిర్వహణకు కూడా వ్యూహరచన చేశారు. దీనిలోభాగంగానే నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నెక్కొండలో టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. అదేవిధంగా చెన్నారావుపేటలో కూడా మండలస్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహించగా పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో గతానికి మించి మెజారిటీ అందించాలని కార్యకర్తలు నిర్ణయించారు. మండల, డివిజన్, నియోజకవర్గస్థాయి సమావేశాలను విజయవంతం చేసుకునేలా ఎమ్మెల్యేలు వ్యూహరచన చేస్తున్నారు. మండలస్థాయి ప్రచారంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సంపేట నియోజకవర్గం ముందువరుసలో ఉంది. గ్రామస్థాయిలో పర్యటించేందుకు మరోవైపు పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...