ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టాలి


Sun,March 24, 2019 02:06 AM

- పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మార్చి 23 : భూగర్భ జలాలను పెంపొందించుకోవడం కోసం ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టుకొని భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మండలంలోని కట్య్రాలలో బాలవికాస ఆధ్వర్యంలో ప్రపంచ నీటిదినోత్సవం సందర్భంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈక్రమంలోనే దయాకర్‌రావు కేన్వాయ్‌లో రాయపర్తికి వెళ్తూ ర్యాలీని చూసి ఆగి ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో వర్షపు నీరు వృథాగా పోయి నదులు, సముద్రాలలో కలుస్తున్నదన్నారు. కానీ వర్షపునీరు పడిన చోటనే భూమిలో ఇంకే విధంగా ప్రయత్నించినట్లయితే నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయన్నారు.

సుమారు 500ల ఫీట్ల మేరకు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందుకని గతంలోనే ఆకేరువాగుపై దూరదృష్టితో చెక్‌ఢ్యాంలను నిర్మించడం జరిగిందన్నారు. ఇదే తరహాలో ప్రజలు కూడా గ్రామాల్లో వర్షపు నీటిని ఏమాత్రం బయటకు వెళ్లకుండా ఇండ్లలో ఇంకుడు గుంతలు తీసుకొని నీటిని గుంతల్లోకి మల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే రైతులు వ్యవసాయ భూములలో విధిగా పాంపాండ్‌ను నిర్మించినట్లయితే వర్షాకాలంలో పాంపాడ్ నిండి ఏడాదంతా నీరు ఉంటుందన్నారు. దీనివల్ల భూములోకి నీరు ఇంకి భూగర్భ జలం పెరుగుతుందని వివరించారు. అందుకనే ఉపాధి హామీ పథకంలో ప్రతీ రైతు పొలంలో పాంపాడ్ నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిని తోడుగా కుంటలు, చెరువులల్లో కూడా నీరు నిలిచి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. అలాగే ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రస్తుతం నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగ ర్యాలీ నిర్వహించిన చిన్నారులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కట్య్రాల మాజీ సర్పంచ్ భాస్కర్, బాలవికాస ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...