మానుకోటపై గులాబీ జెండా ఎగురవేస్తాం


Sat,March 23, 2019 02:01 AM

మహబూబాబాద్, జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : మానుకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం ఖాయమైందని, మెజార్టీపైనే దృష్టి కేంద్రీకరించామని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 1న సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్నారని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలలకు అత్యున్నత పదవులు ఇచ్చి గిరిజనులను టీఆర్‌ఎస్ గౌరవించిందని అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు గిరిజనులు జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా 18 రోజులే సమయమే ఉన్నందున ప్రతీ టీఆర్‌ఎస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ అభివృద్ధి కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి తామే నిదర్శనమని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేసేవిధంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు తీసుకొచ్చి మిడ్‌మానేర్ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్-1, స్టేజ్-2 ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. జూన్ తర్వాత చెరువులన్నీ జలకళను సంతరించుకోనున్నాయని వెల్లడించారు. త్వరలోనే బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చిందని పనులు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి నిండు మనసుతో దీవించాలని ఓటర్లను కోరారు. విలేకరుల సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బాలాజీనాయక్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మార్నేని వెంకన్న, డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, డీఎస్ రవిచంద్ర, మహబూబాబాద్ మండల అధ్యక్షుడు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, బయ్యారం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి, ఎండీ ఫరీద్ పాల్గొన్నారు.

అందరూ ఆశీర్వదించండి..
తనకు అతి చిన్న వయస్సులోనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నా తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నాకు జన్మనిస్తే సీఎం కేసీఆర్ నాకు పునర్జన్మనిచ్చారు. ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ నా కన్నతల్లి లాగా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అదేవిధంగా బాబాయ్ శంకర్‌నాయక్ నాకు పదవి వచ్చేందుకు ముందునుంచి సహకరించారు. మా పెద్దన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి నాకు తోడు నీడగా నిలిచారు. అదే విధంగా ఇల్లందు, పినపాక, భద్రాచలం ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు నన్ను గెలిపించేందుకు కృషి చేస్తాననడం ఆనందంగా ఉంది. మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి. పని చేసి చూపిస్తా. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు పార్లమెంట్‌లో పోరాడుతా. సారూ ప్లస్ కారు = 16 నినాదంతో ప్రతీ కార్యకర్త ప్రచారం చేయాలని కోరారు.
మాలోత్ కవిత, మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి

బలరాం మనకు అవసరమా !
పోరాడి సాధించుకున్న తెలంగాణను ఒక వైపు సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఓ టు వేయకుంటే తెలంగాణ ప్రాం తాన్ని ఆంధ్రాలో కలుపుతానన్న కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ మనకు అవసరమా! కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బలరాంనాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఏ పని చేశారు. నా నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌అభ్యరికి 50 వేల మెజార్టీ ఇస్తా. కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చే సత్తా లేదు. మాలోత్ కవిత విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కు అందరం బాసటగా నిలుద్దాం.
పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles