నేడే ఎమ్మెల్సీ పోలింగ్


Fri,March 22, 2019 03:13 AM

-ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
-ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్
-గ్రామాలకు తరలిన సామగ్రి,నిర్వహణ సిబ్బంది
-16 పోలింగ్ కేంద్రాలు..805 మంది ఉపాధ్యాయ ఓటర్లు
-పోలీసుల భారీ బందోబస్తు
-పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ హరిత

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనసమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేడు (శుక్రవారం) పోలింగ్ జరగనుంది. ఈ మేరకు రూరల్ జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తికావడంతోపాటుగా ప్రతీ పోలింగ్ కేంద్రానికి గురువారం సాయంత్రంకల్లా బ్యాలెట్‌పత్రాలు, బాక్సులు, ఎన్నికల సామగ్రి పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ఎన్నికల సామగ్రిని రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత, జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్‌మహేందర్‌రెడ్డి, డీఆర్వో హరిసింగ్‌లు సిబ్బందికి అందజేశారు. ఈ మొత్తం ఉపాధ్యాయ నియోజకవర్గంలో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రూరల్ జిల్లాలో 16 మండలాల్లో 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు జరిగే ఈ ఎన్నికల్లో జిల్లాలోని 805మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వీరిలో 605 మంది పురుషులు ఉండగా 200మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 16 మీడియం బ్యాలెట్ బాక్సులను, 18 జంబో బ్యాలెట్ బాక్సులను, 56 మంది పీవోలు, ఏపీవోలు, ఓపీవోలను, 7 మంది సెక్టోరియల్ ఆఫీసర్లను, 9 మంది నోడల్ అధికారుల ను నియమించారు. ఈ ఎన్నికల్లో 14ఫ్లయింగ్‌స్వాడ్స్, 14మోడల్ కోడ్ కండక్ట్ (ఎంసీసీ)టీంలు బాధ్యతలు నిర్వర్తించనున్నాయి. 16 కేంద్రాలతోపాటు వివిధ రూ ట్లలో 30 మంది వీడియోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. 18 మంది మైక్రోఅబ్జర్వర్లు, 16మంది ఓటరు గుర్తింపు అధికారులు విధుల్లో ఉన్నారు. అంతేకాకుండా 22మంది వెబ్‌కాస్టింగ్ వలంటీర్లకు కూడా బాధ్యతలు అప్పగించారు.

ఈ మేరకు బ్యాలెట్ బాక్సులు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, పోస్టర్లతో ఎన్నికల సిబ్బంది జిల్లాలో ఏర్పాటు చేసిన 8మినీ బస్సుల్లో జిల్లాలో ఏర్పాటు చేసి 16 మండలాల్లోగల పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మ ధ్యాహ్నం సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహ ణపై జిల్లా య ంత్రాంగం శిక్షణ కూడా ఇచ్చింది. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాలులో సమావేశమై పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు తమ సందేహాలను నివృత్తి చేసుకుని ఎన్నికల సామగ్రితో బయలుదేరి వెళ్లారు.

జిల్లాలో 805మంది ఓటర్లు
వరంగల్ రూరల్ జిల్లాలో 805 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. నల్గొండ కేంద్రంగా ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గంలో వరంగల్ రూరల్ జిల్లా ఒక భాగం. ఈ జిల్లాలో 14 పాత మండలాలు కాగా దామెర, నడికూడ కొత్త మండలాలు ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ మండలకేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు జిల్లాలో ఉన్న 805 మంది ఓటర్లకుగానూ అధిక ఓటర్లు ఉన్న చోట పెద్ద బాక్సులను, మిగతా చోట్ల చిన్న బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు.

తరలిన ఎన్నికల సామగ్రి
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసిన జిల్లా అధికారయంత్రాంగం 16 మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు గుండుసూది నుంచి మొదలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సిబ్బందిని సాయుధ పోలీసు బందోబస్తు మధ్య క్షేమంగా తరలించారు. గురువారం పొద్దుపోయేసరికల్లా అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి, సిబ్బంది చేరినట్లు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది.

నేడు మద్యం దుకాణాలు బంద్
ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. గురువారం హోలీ పండుగ కావడంతో మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ బంద్‌ను శుక్రవారం కూడా కొనసాగించేలా జిల్లా అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోసాయంత్రం ఎన్నికలు ముగిసేవరకు మద్యం దుకాణాలు తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలను సీజ్ చేశారు.

భారీ బందోబస్తు
రూరల్ జిల్లాలో 16 ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి బందోబస్తుకు గానూ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటుగా సాయుధ పోలీసు పహారా మధ్య బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడు రూట్లలో ఇద్దరు ఎస్సైలు, 14 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్‌లు, 28 మంది పోలీసు కానిస్టేబుళ్లు , ఐదుగురు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు సీఐలు, పది మంది ఎస్సైలు, 17 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్‌లతోపాటుగా 38 మంది కానిస్టేబుల్‌లు, మరో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లు ఈ బందోబస్తులో పాల్గొననున్నారు. బ్యాలెట్ బాక్సుల తరలింపులో ఒక ఆర్‌ఎస్సై, ఇద్దరు ఏఆర్ ఎస్సైలు, 32 మంది పోలీసులు పాల్గొననున్నారు.

పోలింగ్ కేంద్రాలకు ఓటరు వెళ్లిన వెంటనే ఆయన గుర్తింపుకార్డును పరిశీలిస్తారు. అనంతరం బ్యాలెట్ పేపర్‌ను అందజేస్తారు. ఆ బ్యాలెట్‌పత్రంతోపాటుగా నిర్ణీత రంగు స్కెచ్ పెన్‌ను అందిస్తారు. ఇచ్చిన బ్యాలెట్ పత్రంలో అదే స్కెచ్‌తో ప్రాధాన్యతాక్రమంలో అభ్యర్థుల పేరుకు ఎదురుగా అంకెలు వేయాల్సి ఉంటుంది. మొదట ప్రాధాన్యతా అంకెను ఒకరికి వేసిన తరువాత వారి ఇష్టానుసారంగా బ్యాలెట్ పత్రంలోని అభ్యర్థులకు వారివారి పేర్లకు ముందు అంకెను వేయాల్సి ఉంటుంది. క్రమపద్ధతి లేకుండా బ్యాలెట్‌పై ప్రాధాన్యతను గుర్తిస్తూ అంకెలు వేస్తే ఓటు చెల్లదు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణ సిబ్బంది అందించే స్కెచ్‌పెన్‌తో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తింపుకార్డుల్లో అడిగిన వెంటనే పోలింగ్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది.

ఏర్పాట్లు పూరి ్త: కలెక్టర్ ఎం. హరిత
రూరల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశాం. గురువారం సాయంత్రంకల్లా సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించాం. అధికారులు ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నారు. సామగ్రి పంపిణీ పూర్తిచేసాం. కొందరు సిబ్బందిని రిజర్వులో ఉంచాం. రిసీవింగ్ కౌంటర్లకు సంబంధించిన ఏర్పాట్లుపూర్తిచేసాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసాం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంతోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఏవైనా సందేహాలు ఉంటే పోలింగ్ అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...