ఉపాధీ భరోసా


Thu,March 21, 2019 01:21 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : వేసవిలో కూలీలు ఎక్కువ గంటలు పనిచేయని కారణంగా ప్రభుత్వం అదనంగా భృతి చెల్లిస్తున్నది. మార్చి ప్రారంభంలోనే ఎండలు తీవ్రం కావడంతో పనులకు వెళ్లే కూలీల సంఖ్య గ్రామాల్లో గణనీయంగా తగ్గుతున్నది. చేసిన పనిమీద అదనంగా మరింత మొత్తాన్ని కూలీలకు వేతనంగా ఇవ్వాలని ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలోనే అలవెన్స్‌ను ప్రకటించింది. ఇందులో ఫిబ్రవరి నెలలో కూలీ చేసిన పనిమీద అదనంగా 20 శాతం, మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్ నెలలో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితే 20 శాతం అలవెన్స్ చెల్లించేలా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫిబ్రవరిలో కూలీలకు చేసిన పనిమీద 20 శాతం అదనంగా కూలి డబ్బులను అందజేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా జీవో ప్రకారం కూలీలకు అదనపు భృతిని అందించేందుకు అధికారు లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ లు తీవ్రంగా ఉండడంతో వర్షాకాలం, చలికాలంలో రూ.300 వరకు పనిచేసే ఒక్కో కూలీ.. ప్రస్తుతం రూ.200 పని కూడా చేసే పరిస్థితి ఉండడం లేదు. ఉదయం 11 గంటల వరకే ప్రస్తుతం కూలీలు పనులు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఉదయం 10 గంటల వరకే పనులు పూర్తి చేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. పని మిగిలితే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పనిచేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదనంగా 30 శాతం వరకు అలవెన్స్ ఇస్తుండడంతో కూలీల కుటుంబాలకు కొంత మేరకు భరోసా లభిస్తున్నది.

ఇప్పటి వరకు 13,06,792 పనిదినాలు పూర్తి..
జిల్లాలో ప్రభుత్వం 3,14,062 మందికి జాబ్‌కార్డులను మంజూరు చేసింది. జిల్లాలో 401 గ్రామ పంచాయతీలో ఉండగా.. 1,48,984 కుటుంబాలకు 3,14,062 మందికి ప్రభుత్వం జాబ్‌కార్డులను జారీ చేసింది. ఇందులో వేసవిలో పనిచేసే కూలీలకు విధిగా సమ్మర్ అలవెన్స్ వర్తించనున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 57,37,585 పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 13,06,792 పనిదినాలను కల్పించారు. లక్ష్యంలో 43.68 శాతాన్ని అధికారులు పూర్తి చేయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కూలీలందరికీ నిబంధనల ప్రకారం సమ్మర్ అలవెన్స్ చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ పట్టణాలు మినహా గ్రామాల్లో మొత్తంగా 4,555 మంది కూలీలు పనిచేస్తున్నారు. గత వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ సంఖ్యలో కూలీలు పనిచేశారు. వేసవి దృష్ట్యా మహిళలు కూలి పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో వేసవిలో ప్రస్తుతం అన్ని మండలాల్లో కలిసి 4,555 మంది కూలీలు ఈజీఎస్‌లో పనిచేస్తున్నారు. ఇందులో ఆత్మకూరులో 227, చెన్నారావుపేటలో 28, దుగ్గొండిలో 259, గీసుగొండలో 178, ఖానాపురంలో 75, నల్లబెల్లిలో 225, నర్సంపేటలో 88, నెక్కొండలో 124, పరకాలలో 139, పర్వతగిరిలో 402, రాయపర్తిలో 840, సంగెంలో 995, శాయంపేటలో 101, వర్ధన్నపేటలో 874 మంది కూలీలు ఈనెల 20వ తేదీన ఈజీఎస్ పనులు చేశారు. వీరందికి కూడా మార్చి నెలలో ఇచ్చే 35 శాతం అలవెన్స్ వర్తించనున్నది.

పనుల కేటాయింపులో కూలీలకు చేయూత
గ్రామాల వారీగా పనులను కేటాయించడంతో కూలీలకు చేయూత లభిస్తున్నది. ఈజీఎస్ పనుల కింద సేద్యపు కుంట లు, వర్మీకంపోస్టు, నాడెపు కంపోస్టు, ఎరువుల కోసం గుంతల తవ్వకం, ఇంకుడు గుంతలు, డంపింగ్‌యార్డులు, చెరువుల పూడికతీత, మధ్యాహ్న భోజ న వంటగదుల నిర్మాణం, వైకుంఠధామాలు, మరుగుదొడ్ల నిర్మాణం, పశువులు, మేకలు, కోళ్లఫారాల నిర్మాణాల వంటి పనులను ప్రభుత్వం ఉపాధి హామీలో చేపడుతున్నది. కూలీలు గ్రామాల్లో చేపడుతున్న పనులకు వెళు తూ ఆర్థికంగా వెళ్లదీసుకుంటున్నారు. అంతేకాకుండా హరితహారంలో భాగం గా కూడా రానున్న రోజుల్లో కూలీలతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న ట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి లో అదనపు భృతిని చెల్లిస్తుండడంతో నిరుపేద కుటుంబాలు వలసలకు పో కుండా గ్రామాల్లోనే పనులు చేసుకుం టూ జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం అనుకున్న మేరకు అలవెన్స్‌లను క్రమం తప్పకుండా అందిస్తుండడంతో కూలీ లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వేసవిలో వసతులు కల్పిస్తున్నాం
వేసవిలో కూలీలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. వారికి ప్రత్యేక అలవెన్స్‌లు కూడా ఇస్తున్నాం. పనివేళలు కూడా తగ్గించి ఉదయం 10 గంటల వరకే పని చేయిస్తునాం. కూలీలు పనులు చేసే చోట నీడ వసతితో పాటుగా ఫస్ట్‌ఎయిడ్ కిట్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నాం. కూలీలు తాగునీరు వారే తెచ్చుకుంటే రూ.5 అదనంగా చెల్లిస్తున్నాం. కూలీలకు వేసవిలో ఆరోగ్యపరమైన ఇబ్బంది రాకుండా అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాం. ఈ అవకాశాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలి.
- ఎం శ్రీనివాసరావు, డీఆర్‌డీవో

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...