ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు


Wed,March 20, 2019 02:58 AM

-బందోబస్తులో 158 మంది పోలీసులు
-56 మంది పీవోలు, ఏపీవోలు, ఓపీవోల నియామకం.. ఏడు రూట్లు విభజన
-ప్రశాంత ఎన్నికలకు కసరత్తు
-నేడు సిబ్బంది రాండమైజేషన్
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారయంత్రాంగం చకాచకా చేస్తున్నది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓవైపు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు విస్తృత ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం వరంగల్ రూరల్ జిల్లాలోని మూడు శాసనసణ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాట్లను చేస్తూనే పీవోలు, ఏపీవోలు, మైక్రోఅబ్జర్వర్లు, పోలింగ్ ఆఫీసర్ల గుర్తింపును పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పనను కూడా పూర్తిచేశారు. బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందిని తర్ఫీదు చేశారు. బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ, పెట్టెల తరలింపు తదితర విషయాలపై అన్ని రకాల సలహాలు, సూచనలను కూడా శిక్షకులు అందజేశారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థులు వారి గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారా సహజంగా ఎదురయ్యే అభ్యంతరాలు తదితర విషయాలపై కూడా కావాల్సిన సూచనలు చేశారు.

జిల్లాలో ఏడు రూట్లను గుర్తించారు. దీనికి 8 మినీ బస్సులు అవసరమని భావించారు. వాటిని సమకూర్చే పనిని రోడ్డు రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. జిల్లాలో 805 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. వీరిలో వీరిలో 605మంది పురుషులు, 200మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో 16 మీడియం, 18 జంబో బ్యాలెట్ బాక్సులు అవసరమని గుర్తించి, 32బాక్సులను జిల్లాకు తెప్పించి సిద్ధం చేశారు. ఇక పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు 56 మందిని ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు.

ఏడుగురు జోనల్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తారు. తొమ్మిది మంది జిల్లా నోడల్ అధికారులకు ఉపాధ్యాయ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 14 ఫ్లయింగ్‌స్కాడ్‌లు ఎన్నికల్లో పనిచేస్తాయి. 14ఎంసీసీ టీంలు, 14 వీడియో సర్వైలెన్స్ టీం(వీఎస్‌టీ)లు, 30 మంది వీడియోగ్రాఫర్లు, 18 మంది మైక్రోఅబ్జర్వర్లు పోలింగ్ స్టేషన్ల వారీగా అందుబాటులో ఉండనున్నారు. ఇదిలా ఉండగా ఓటర్ల గుర్తింపుకోసం 16మంది అధికారులను నియమించారు. అంతేకాకుండా అవకాశం ఉన్న ప్రతీ చోట వెబ్‌కాస్టింగ్ వలంటీర్ల నియామకం పూర్తిచేసి 22 సెంటర్లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. 15డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లను, 15 రిసీవింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో స్వీపర్లను, ఇతర సహాయకులను 20మందిని గుర్తించి అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చారు. పోలింగ్ సిబ్బందిని, మెటీరియల్ చేరవేసేందుకు వాహనాల గుర్తింపు పనిలో ఉన్నారు.

16 పోలింగ్ కేంద్రాలు, ఏడు రూట్లలో ఇద్దరు ఎస్సైలు, 14మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, 28 మంది పీసీలు, ఐదుగురు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు మొత్తం 48 మంది పోలింగ్ స్టేషన్లలో బందోబస్తు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు సీఐల పర్యవేక్షణలో పది మంది సివిల్ ఎస్సైలు, 17 మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, డబ్ల్యూహెచ్‌సీలు, 38 మంది పోలీసు కానిస్టేబుల్‌లు, ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 75మంది సివిల్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక ఆర్‌ఎస్సై, ఇద్దరు ఏఆర్‌ఎస్సైలు, 32 మంది పీసీలు మొత్తం 35మంది ఆర్మ్‌డ్ రిజర్వు ఫోర్స్ బందోబస్తు నిర్వహించనుంది.

22న ఎన్నికలు
వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 22వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం నిర్ణీత కౌంటింగ్ కేంద్రాలకు పోలీసు రక్షణ మధ్య బ్యాలెట్‌బాక్సులను తరలిస్తారు. 21వ తేదీన వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాలులో మెటీరియల్‌తోపాటుగా పోలింగ్ సిబ్బంది మెటీరియల్‌ను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తారు. 20వ తేదీ పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేయనున్నారు. 20వ తేదీన పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్, ఆర్డర్ కాపీల అందజేత ఉంటుంది. ఇక ఇప్పటికే జిల్లాలో 18వ తేదీన పోలింగ్ సిబ్బందికి రెండోవిడత శిక్షణను పూర్తిచేశారు. 15వ తేదీన మైక్రోఅబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. 11వ తేదీన పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణను పూర్తిచేశారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...