పింఛన్‌దారుల్లో ఆనందం


Wed,March 20, 2019 02:53 AM

-ఏప్రిల్ నుంచి రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016
-ఇప్పటికే 57ఏళ్లు నిండిన వారిని గుర్తించిన అధికారులు
-జిల్లాలో 96,364 మంది లబ్ధిదారులు
పరకాల, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఆసరా పథకం లబ్ధిదారులకు భరోసాగా నిలుస్తోంది. వరంగల్ రూరల్ జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, పైలేరియా, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ ద్వారా ప్రభుత్వం పింఛన్లను అందిస్తున్నది. ఇప్పటికే ఆసరా పథకం ద్వారా జిల్లాలో 96,364మంది లబ్ధిపొందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకోసం 57ఏళ్లు పూర్తియిన ప్రతీ ఒక్కరికి పింఛన్ ఇచ్చేందుకు ఇప్పటికే అధికారులు తమ కసరత్తును పూర్తిచేశారు. రూ.వెయ్యి ఉన్న పింఛన్‌ను రూ.2016, రూ.1500 ఉన్న పింఛన్‌ను రెట్టింపు చేస్తూ రూ.3016 ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వం ఇచ్చే రూ.200 పింఛన్‌ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 8 నవంబర్ 2014న ఆసరా పథకాన్ని ప్రారంభించారు. రూ.200 ఉన్న ఒకేసారి రూ.వెయ్యికి పెంచడంతోపాటు 65ఏళ్ల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికి పింఛన్ ఇచ్చేలా సీఎం అధికారులను ఆదేశించారు. దివ్యాంగులైన వారికి సదరం సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఉంటే పింఛన్ అమలు చేశారు. వికలాంగులైతే 40 శాతం పైబడి ఉన్న వారికి, వినికిడి లోపం ఉన్న వారైతే 51శాతం సదరం సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది.

వృద్ధులకు, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం ఆసరా పింఛన్ అందజేస్తుండడంతో వారి బతుకుల్లో మార్పు వచ్చింది. గతంలో వృద్ధులను చీదరించుకునే సందర్భాలు ఉండగా స్వరాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్‌తో తమకు మరింత గౌరవం పెరిగిందని, తమ కొడుకులు, కోడళ్లు మంచిగా చూసుకుంటున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రూ.వెయ్యి పింఛన్‌కే తమకు గౌరవం పెరిగిందని, ఏప్రిల్ నుంచి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను డబుల్ చేసి దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికులకు రూ.2016 అందించనున్నాడనే విషయం విన్న లబ్ధిదారులు తమ పెద్దకొడుకు సీఎం కేసీఆర్ అని ఆనందంగా చెబుతున్నారు.

ఇక 57ఏళ్లు నిండినవారికి కూడా..
ఏప్రిల్ మాసం నుంచి 57ఏళ్లు నిండిన వారందరికి ఆసరా పింఛన్ ద్వారా రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇచ్చేందుకు సిద్ధమైంది. గతంలో 65ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందిస్తుండగా ఏప్రిల్ మాసం సీఎం కేసీఆర్ తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఆసరా పింఛన్‌దారుల వయస్సును 57ఏళ్లకే తగ్గించారు. ఆయా మండలాల్లో ఎంపీడీవోలు ఓటరు లిస్టులో 57ఏళ్లు పూర్తయిన వారిని గుర్తించి వారంతా పింఛన్ పొందేందుకు అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో 96,364మందికి ఆసరా పింఛన్ అందిస్తుండగా వయస్సు కుదింపుతో మరింతమందికి ఆసరా పింఛన్ అందనుంది. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 38,159 మందికి, దివ్యాంగులకు 13,419, వితంతువులకు 35,368, చేనేత కార్మికులకు 1521, గీత కార్మికులకు 3,270, పైలేరియా వ్యాధిగ్రస్తులు 163మంది, బీడీ కార్మికులు 2,043, ఒంటరి మహిళలు 2,421మందికి ఆసరా పింఛన్లు అందుతున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఆత్మకూరులో 5,097, చెన్నారావుపేటలో 5,085, దామెరలో 5,043, దుగ్గొండిలో 6,824, గీసుకొండలో 4,664, ఖానాపురంలో 4,442, నల్లబెల్లిలో 5,402, నర్సంపేటలో 5,253, నర్సంపేట మున్సిపాలిటీలో 3,662, నెక్కొండలో 7,249, పరకాల మునిసిపాలిటీలో 2,676, పరకాల మండలంలో 7,074, పర్వతగరిలో 6,031, రాయపర్తిలో 7,538, సంగెంలో 6,668, శాయంపేటలో 6,764, వర్ధన్నపేటలో 6,729మందికి పింఛన్లు అందుతున్నాయి. మొత్తం 96,201మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా.. పైలేరియా బాధితులు అలంకానిపేటలో 43, చెన్నారావుపేటలో 67, దుగ్గొండిలో 24, మేడపల్లిలో 5, నల్లబెల్లిలో 16, నెక్కొండలో 8 మంది మొత్తం 163మందికి కూడా పింఛన్లు అందుతున్నాయి. దీంతో జిల్లాలో ఆసరా పింఛన్ 96,364మంది పొందుతున్నారు.

బయోమెట్రిక్‌తో చెల్లింపులు
ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు బయోమెట్రిక్ విధానంలో ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఆసరా పింఛన్ల డబ్బులను అందజేస్తున్నారు. ప్రతినెల మొదటివారంలో గ్రామాల్లోని పోస్టుమాస్టర్లు బయోమెట్రిక్ విధానంతో లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకుని పింఛన్ డబ్బులను నేరుగా లబ్ధిదారులకే అందజేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వారికి ఇంటి వద్దకు వెళ్లి వేలిముద్రలను సేకరించి మరీ డబ్బులు ఇస్తున్నారు.
ఇంట్లో ఎంతమంది దివ్యాంగులుంటే అంతమందికి..
ఒకే కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులున్నా వారందరికీ ఏప్రిల్ నుంచి రూ.3,016 పింఛన్ ఇస్తారు. సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్నవారందరికి పింఛన్ అందనుంది. మూడేళ్లు పైబడిన దివ్యాంగులందరికి పింఛన్‌ను ప్రభుత్వం అందజేస్తోంది.

డబుల్ సంతోషం..
ఏప్రిల్ నుంచి ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లను డబుల్ చేస్తుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదింటి పెద్ద కొడుకు కేసీఆర్ మాట ఇస్తే తప్పడని మరోసారి నిరూపించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 96364 మందికి పింఛన్లు అందుతుండగా 57ఏళ్లకే వయస్సును కుదించడంతో జిల్లాలో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...