రాజకీయ కోలాహలం


Fri,February 22, 2019 02:01 AM

- ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా విడుదల
- నేడు అభ్యంతరాల స్వీకరణ
- 25న తుది జాబితా విడుదల
- త్వరలోనే రిజర్వేషన్ల ఖరారు
- పురపోరుకు సిద్ధం కావాలని అధికారుల ఆదేశాలు
- కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల సిబ్బందికి శిక్షణ
- పోలింగ్‌బూత్‌ల గుర్తింపులో అధికారులు బిజీబిజీ
- సిద్ధమైన ఓటరు తుది జాబితా
- జిల్లాలో సర్వత్రా చర్చ

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజాస్వామ్యంపై అపారమైన గౌరవం, ప్రజలపై ఉన్న విశ్వాసం, ఎన్నికలపై ఉన్న నమ్మకంతో నిర్లక్ష్యానికి గురైన స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం పలు వ్యవస్థల్లోని పాలకమండళ్లకు గడువులోగా ఎన్నికలు జరిపేందుకు ముందుకు సాగుతోంది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుంచి అందుతున్న ఆదేశాలతో జిల్లా అధికారులు ఆ దిశగా సమాయత్తమవుతున్నారు. దీంతో వరుస ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకుసాగుతోంది. జిల్లాలో మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలను విడుదల చేసిన అధికారులు మున్సిపల్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రాథమిక అంశాల పనులను కూడా పూర్తిచేస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

పోలింగ్‌బూత్‌ల గుర్తింపులో అధికారులు
రూరల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో ఇప్పటికే వార్డుల విభజనను పూర్తిచేసిన మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ పరిధిలో అందిన సంకేతాలతో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది వివరాలు, కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్‌రూంల ఏర్పాటు తదితర ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కీలకమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అధికారులకు నివేదించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు లిస్టుల జాబితాలను కూడా ఫైనల్ చేశారు. పోలింగ్ బూత్‌లు, ఓటరులిస్టు జాబితా పని పూర్తికావడం, మున్సిపాలిటీల్లో ఉన్న జనాభా, ఓటర్ల గణన వంటి వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరవేయడం లాంటి కార్యక్రమాలను జిల్లాలోని మూడు మున్సిపాలిటీల అధికారులు పూర్తిచేశారు.

పెరిగిన ఓటర్లు
వరంగల్ రూరల్ జిల్లాలో మూడు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గం మినహాయిస్తే మిగిలిన రెండు నియోజకవర్గాల్లోని 13 మండలాల్లో 21,386 ఓట్లు పెరిగాయి. కొత్తగా నమోదు చేసుకున్న ఈ ఓట్లతో జిల్లలోని రెండు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య 4,29,346కు చేరింది. కొత్తగా నమోదు చేసుకున్నవారిలో మహిళల సంఖ్య అధికంగా ఉంది.

ముసాయిదా విడుదల, అభ్యంతరాల స్వీకరణకు గడువు
వరంగల్ రూరల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు జిల్లా అధికారయంత్రాంగం సమాయత్తమవుతోంది. 14 మండలాలతో ఏర్పడిన వరంగల్ రూరల్ జి ల్లాలో దామెర, నడికుడ మండలాలు కొత్తగా ఏ ర్పడ్డాయి. ఈ దఫా జరిగే ఎన్నికల్లో 16 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముసాయిదా జాబితాను విడుదల చేసిన అధికారయంత్రాంగం ఈ నెల 22వ తేదీన అభ్యంతరాల స్వీకరణ, 25న తుది జాబితా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంది. 2011 జనాభా లె క్కల ప్రకారం 3,500 నుంచి 4వేల మంది జనాభాకు ఒక ఎంపీటీసీ చొప్పున ఖరారు చేశారు. దీంతో ఈ 16 మండలాల్లో 179 మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా విడుదల చేసిన అధికారులు 25న తుది జాబితా విడుదల చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 6,07,855 జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాల ఖరారు జరిగింది.

సిబ్బందికి శిక్షణ
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాలతో వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసిన అధికారులు కమిషన్ ఆదేశాలతో ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారుల అధ్యక్షతన ఎన్నికల సిబ్బంది శిక్షణ కూడా ఇచ్చారు. బీఎల్‌వోల పరిధిలో ఓటు హక్కుపై ఈవీఎంల వినియోగం, ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది వారివారి బాధ్యతలను నిర్వహించే విధానాలపై శిక్షణ కూడా ఇచ్చారు. ఈవీఎంల వినియోగంపై ఈ నెల 25వ తేదీ నుంచి ప్రచారం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సర్వత్రా చర్చ
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రధానం. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం పయనిస్తోంది. గత సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిం చిన రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల ఎన్నికలను సకాలంలో నిర్వహించింది. అదే దిశలో పురపాలక సంఘాల ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ప్రభుత్వం తమవంతు బాధ్యతను నిర్వహించేలా అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలతో అన్ని రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా ప్రకటనతోపాటు ఓటర్ల జాబితాల సవరణలు పూర్తికావడం, లోక్‌సభ ఎన్నికల సిబ్బందికి శిక్షణలు ఇస్తుండడంతో ఆశావాహులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...