పదిలో ఉత్తమ ఫలితాలకు కసరత్తు


Wed,February 20, 2019 02:26 AM

-153 పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు
-త్వరలో ఇంటర్నల్ మార్కుల అప్‌లోడ్
నెక్కొండ, ఫిబ్రవరి 19: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గతంలో మాదిరిగా ఎస్సెస్సీ ఫలితాల్లో వరంగల్ రూరల్ జిల్లాను అగ్రశ్రేణిలో నిలపాలని పట్టుదలతో ఉంది. జిల్లా కలెక్టర్ హరిత ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆర్జేడీ, ఇన్‌చార్జ్ డీఈవో రాజీవ్ ఆధ్వర్యలో ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించడంతోపాటు వంద శాతం ఫలితాలను సాధించే లక్ష్యంతో ప్రధానోపాధ్యాయులు, సజెక్టు టీచర్లను కృషిచేస్తున్నారు.వార్షిక పరీక్షల్లో 100 మార్కులకు సంగ్రహణాత్మక మూల్యంకనం (ఎస్‌ఏ2) 80 మార్కులకు పరీక్ష, మిగిలిన 20 మార్కులను విద్యార్థి అభ్యసనలో భాగంగా రూపొందించిన ప్రాజెక్టులు, ప్రయోగాలు, పుస్తక సమీక్ష, తరగతిలో విద్యార్థి భాగస్వామ్యం తదితర అంశాల ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. ఇవి గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా నిర్వహించే మార్కుల నమోదును ఎలా చేశారో మండలాల వారీగా ఏర్పాటు చేసిన పరిశీలన బృందాలు ఇప్పటికే తనిఖీలు పూర్తి చేశాయి.

మూడు రోజులపాటు తనిఖీలు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు నమోదు చేసిన ఇంటర్నల్ మార్కులను పరిశీలించేందుకు ఎంఈవోల ఆధ్వర్యంలో పరిశీలక(తనిఖీ) బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో మండలంలో సీనియర్ హెచ్‌ఎంల ఆధ్వర్యంలో భాషా పండితులు, విషయ నిపుణుల బృందం వీటిని పరిశీలించింది. తనిఖీ బృందాలు ధ్రువీకరించిన రిపోర్టులను సంబంధిత అధికారులకు సమర్పించిన తర్వాత ఆన్‌లైన్‌లో మార్కులు అప్‌లోడ్ చేయనున్నారు.

ప్రత్యేక తరగతులను పరిశీలిస్తున్న అధికారులు
పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో కొన్నిచోట్ల నామమాత్రంగానే సాగాయి. మారుమూల పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను పకడ్బందీగా నిర్వహించేలా కలెక్టర్ చొరవ చూపిస్తున్నారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, కార్యదర్శి, జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు విద్యార్థులకు నిర్వహిస్తున్న తరగతులను తనిఖీ చేస్తున్నారు.

స్నాక్స్ నిధుల విడుదల
జనవరి 4 నుంచి జిల్లాలోని 153 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గురుకుల, కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాయం త్రం వేళ విద్యార్థులకు స్నాక్సు అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఐదు రూపాయల విలువైన స్నాక్సు పంపిణీ చేస్తున్నారు. గతంలో ఒక్కో విద్యార్థికి రూ.2 చొప్పున ఖర్చు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. అయితే నిధులు చాలక, కొన్నిచోట్ల నిధులు అందుబాటులోలేక తూతూ మంత్రంగానే సాగించారనే విమర్శలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న యంత్రాంగం లోపాలను సవరించేందుకు తొలి విడుతలో నెల రోజులకు సరిపడా నిధులు ఇచ్చారు. ఇటీవల అదనంగా 45 రోజులకు స్నాక్సు నిధులు రూ 10 లక్షలు విడుదల చేశారు. నేరుగా ఎంఈవోల ఖాతాల్లో జమచేసి సకాలంలో ప్రధానోపాధ్యాయులకు అందేలా చేస్తున్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం..
జిల్లాలో శుక్రవారం టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు మొదలయ్యాయి. రోజు ఒక్క పరీక్ష చొప్పున 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గతేడాది ఎస్సెస్సీ వార్షీక పరీక్షలకు సిద్ధం చేసిన సెకండ్ సెట్ పేపర్‌తో ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమాధాన పత్రాలను దిద్ది వార్షిక పరీక్షలకు సిద్ధ చేయాలని, కఠిన ప్రశ్నలకు సమాధానాలు రాసేలా తర్ఫీదునివ్వాలని సూచించారు. డీసీఈబీ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రశ్నపత్రాలను పంపిణీ చేసి ఫలితాలను అంచనా వేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వారంలో సమీక్ష సమావేశం జరుగునున్నట్లు సమాచారం.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...