బీసీల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తోడ్పాటు


Sun,September 23, 2018 03:32 AM

-రుణాలను సద్వినియోగ పరుచుకోవాలి
-చిన్న వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగాలి
-కలెక్టర్ ముండ్రాతి హరిత
-బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సింహస్వామితో కలిసి చెక్కుల పంపిణీ

రూరల్ కలెక్టరేట్,సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టికి చేయూతను అందిస్తుందని కలెక్టర్ ముండ్రాతి హరిత పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బీసీ కులాల వారికి ఇండస్ట్రీస్ సర్వీస్ బిజినెస్ పథకం కింద ప్రభుత్వం అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ వెనకబడిన కులాల వారికి ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో 50 వేల రూపాయలను అందిస్తుందని, ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో వంద శాతం సబ్సిడీతో తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇచ్చిందని, చిన్న వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించుకుని మరింత ఆర్థికంగా బలపడాలని అన్నారు. గతంలో వీరి పరిస్థితి మరీ దయనీయంగా ఉండేదనీ, వ్యాపారాలు చేసుకోవాలంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలను పొందేవారని దాంతో అప్పుల ఊబిలో చిక్కుకునేవారని అన్నారు.

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సొంతానికి వాడుకోకుండా చిన్న వ్యాపారాలను నడిపించుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రూరల్ జిల్లాలో 623 మంది లబ్ధిదారులకు 3కోట్ల 11లక్షల 50 వేల రూపాయలను పంపిణీ చేశారు. 107 యూనిట్లను విశ్వబ్రాహ్మణులకు,139 యూనిట్లు గౌడ కులస్తులకు,107యూనిట్లను రజకులకు, 95 యూనిట్లను నాయిబ్రాహ్మణులకు, 47 యూనిట్లను కుమ్మరులకు, 24 యూనిట్లను పూసల కులస్తులకు, 34 యూనిట్లు వడ్డెర కులస్తులకు, 07 యూనిట్లు బోయ వాల్మీకులకు,04 యూనిట్లు సగర ఉప్పర కులస్తులకు, 01 యూనిట్ మేదర కులస్తులకు,01 యూనిట్ బట్‌రాజు కులస్తులకు,18 యూనిట్లను ఎంబీసీ కులస్తులకు, 38 యూనిట్లను బీసీలకు అందించామని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి వెల్లడించారు. కాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి ఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజునే బీసీ కార్పొరేషన్ ద్వారా 100 మందికి ఈ ఋణాలను అందజేసింది. దీనిపై బీసీ సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల, పర్వతగిరి, సంగెం, గీసుగొండ మండలాల ఎంపీపీలు నేతాని సులోచన,రంగు రజిత, బొమ్మల కట్టయ్య,వీరగాని కవిత, పలు మండలాల జెడ్పీటీసీలు,ఎంపీడీఓలు,ఎంపీటీసీల ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి,ఎంపీటీసీలు,లబ్ధిదారులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...