సంక్షేమమే శ్వాసగా..


Sat,September 22, 2018 01:52 AM

- నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు
- వందరోజుల్లోనే గోదావరి జలాలు
- సబ్సిడీ విద్యుత్ మోటార్ల పంపిణీలో ఉమ్మడి వరంగల్‌జిల్లాలో రికార్డు
- నా ఎజెండా టీఆర్‌ఎస్ జెండా
- మా నాయకుడు కేసీఆర్
- నర్సంపేట నియోజకవర్గ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నా జెండా టీఆర్‌ఎస్.. నా నాయకుడు కేసీఆర్..నీను నాప్రజల వెంటే ఉంటూ... అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా దశాబ్ధాల తరబడిగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి వాటి ఫలితాలను ప్రజలకు పారదర్శకంగా, అవినీతిరహితంగా అందేలా చూస్తున్నానని నర్సంపేట నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నమస్తే తెలంగాణతో సుదీర్ఘంగా మాట్లాడారు. నియోజకవర్గంలో నాలుగేళ్ల మూడుమాసాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఉద్యమకాలం నాటి స్మృతులను ఆయన పంచుకున్నారు. ఈసందర్భంగా మచ్చుకు కొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు గురించి వివరించారు. తాము అహర్నిశలు ఉద్యమనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గంలో పనులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ నాయకులు విజన్ లేకుండా వ్యవహరిస్తున్నారని సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల ఆశిస్సులు కోరే వ్యక్తిగా తాను ముందుకుసాగుతుంటే ప్రతిపక్ష నాయకులు ప్రగతిని అడ్డుకోవడం, కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం, పనుల్లో జాప్యం చేయడం, అధికారులపై జులుం ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలకు ఒడిగడుతున్నారని పెద్ది విమర్శించారు.

ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు గోదావరి జలాలను అందించేందుకు కాంగ్రెస్, టీడీపీల కుట్రలను తప్పికొడుతూ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నామని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పాకాల సరస్సుకు గోదావరి జలాలను మళ్లించడంతోపాటు సమృద్ధిగా పంటపొలాలకు నీరందించే లక్ష్యాలతో 2015లో తాను పాదయాత్ర చేసినప్పుడు వాటి ప్రాధాన్యతను గుర్తించడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు దేవాదుల నుంచి గోదావరి నీరు రామప్ప చెరువులోకి చేరుతోందని, అక్కడి నుంచి పాకాలకు గోదావరి నీళ్లను మళ్లించేందుకు తన స్వకృషితో రాళ్లు, గుట్టలు, అడవుల్లో తిరుగుతూ ప్రత్యేక ఏజెన్సీ ద్వారా సర్వే చేయించినట్లు తెలిపారు. నీటి నిల్వలు పెంచడం, నీటిని క్రమబద్ధంగా వినియోగించడం కోసం ఎక్కువసాగులోకి తేవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని మళ్లించడం కోసం కొత్తగా రీడిజైన్ చేసినట్లు తెలిపారు. పాకాలతోపాటు పక్కనే ఉన్న రంగాయచెరువు కోసం మూడున్నర టీఎంసీల నీటిని పాకాలకు మళ్లించుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. 336కోట్ల రూపాయలతో ఈ సిస్టర్న్ ప్రాజెక్టు చెపట్టామన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాత్రమే ఉన్న ఈ ప్రాజెక్టు విధానాన్ని తమ నియోజకవర్గంలోని పాకాల, రంగాయ చెరువుకు నీళ్లు మళ్లించేందుకు అమలుచేస్తున్నామ న్నారు. ఇది దేశంలోనే రెండవ సిస్టర్న్ ప్రాజెక్టుగా నిలువబోతున్నదని పెద్ది తెలిపారు. నీటి ద్వారా రెండో పంటకు సంబంధించి 28500ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఇంత పెద్ద ప్రాజెక్టును నాణ్యతాప్రమాణాలతో ఇప్పటికే 80శాతం పూర్తిచేశామన్నారు. మరో వంద రోజుల్లో గోదావరి నీటితో చెరువుల్లో అలుగులు పారిస్తామని చెప్పారు. ఇరవై ఎనిమిదిన్నర కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా దబ్బ వాగులోకి నీటిని మళ్లించి దానిద్వారా పాకాలకు పంపిస్తామన్నారు. ఇక రంగరాయచెరువుకు 2.95 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామన్నారు. డీబీఎం 38ద్వారా 180చెరువులను నింపడం జరిగిందని పెద్ది వివరించారు.

అదనపు సహకారం
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చే పథకాలకు తోడుగా సీమాంధ్రుల పాలనలో వెనకబడ్డ నర్సంపేట నియోజకవర్గంలో పథకాలకు సంబంధించి అదనపు కోటాలను మంజూరు చేయించి ప్రతీ ఒక్కరికి లబ్ధిచేకూర్చుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి ఏదో ఒక లబ్ధి చేకూర్చినట్లు పెద్ది పేర్కొన్నారు. నియోజకవర్గంలోని రైతుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి ఆశీస్సులతో 50శాతం సబ్సిడీపై ఏడువేల విద్యుత్ మోటర్లను అందించి ఉమ్మడి జిల్లాలోనే రికార్డు నెలకొల్పామన్నారు. అలాగే పాడిగేదెల పథకంలో కూడా అదనపు నిధులను మంజూరు చేయిస్తున్నట్లు గుర్తుచేశారు.

వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగ అభివృద్ధికి తమ నియోజకవర్గంలో పెద్దపీట వేశామని చెప్పారు. మూడుకోట్ల రూపాయలతో ఒక్కొక్క మండలకేంద్రంలో మార్కెటింగ్ గోదాములను నిర్మించామని, 50వేల క్వింటాళ్ల నిల్వ సామర్థ్యం గల ఈ గోడౌన్లను నియోజకవర్గవ్యాప్తంగా ఆరింటిని నిర్మించి వినియోగంలోకి తెచ్చామని చెప్పారు. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి జరగనంతగా నాలుగున్నరేళ్ల కాలంలో నియోజకవర్గంలో 1సబ్‌స్టేషన్లను నిర్మించి 21కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. 15ఏళ్ల వరకు కూడా తమ నియోజకవర్గంలో సర్‌ప్లస్ విద్యుత్ ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని మాదన్నపేటలో మినీట్యాంక్‌బండ్ నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేయించామన్నారు. కాకతీయ మిషన్ ద్వారా రూ.92కోట్లు ఖర్చు చేసి నాలుగు విడతల్లో చెరువుల్లోని పూడికను తీయించి అభివృద్ధి చేయడంతో ఇప్పుడు అవి జలకళ సంతరించుకున్నాయని పెద్ది వివరించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను 2400ప్రభుత్వం మంజూరు చేస్తే ఈ ఇళ్ల విషయంలో అధికారం కలిగిన స్థానిక శాసనసభ్యుడి నిర్లక్ష్యం వల్ల ఆ ఫైల్ ఏమాత్రం ముందుకుసాగడంలేదన్నారు. రూ.220కోట్లతో మిర్చి పరిశోధనాకేంద్రాన్ని నర్సంపేటకు మంజూరు చేయించామని చెప్పారు. జిల్లాకు మంజూరైన ఏకైక అర్బన్ మోడల్ స్కూల్‌ను నర్సంపేటలో నెలకొల్పుకోవడం జరిగిందని చెప్పారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద సివిల్ దవాఖానను జిల్లాస్థాయి దవాఖానగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

నర్సంపేటలో డయాలసిస్ కేంద్రం, రక్తనిధి కేంద్రం మంజూరు చేయించినట్లు చెప్పారు. గత ఏడాది నియోజకవర్గంలోని అటవీప్రాంతాల ప్రజల కోసం మెడికేటెడ్ దోమతెరలను ప్రత్యేకంగా మంజూరు చేయించినట్లు తెలిపారు. విద్యారంగ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా స్పెషల్ అర్బన్ జిల్లా రెసిడెన్షియల్ స్కూల్‌ను కూడా నర్సంపేటలోనే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణంతో చేయించాలనే సంకల్పంతో 270ట్రాక్టర్లను, 41హార్వెస్టర్లను, 350రొటోవేటర్లను, 350టార్పాలిన్లను మంజూరుచేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ పరిధిలోగల 120కిలోమీటర్ల సింగిల్‌రోడ్డును రూ.120కోట్లతో డబుల్ రోడ్లుగా మార్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 80కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్లను రూ.40కోట్లతో అభివృద్ధి చేసినట్లు పెద్ది తెలిపారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా 110తండాలకు ట్రైబల్ సబ్‌ప్లాన్‌లో భాగంగా బీటీ లింకురోడ్లను నిర్మించినట్లు చెప్పారు. అలాగే టూరిజం అభివృద్ధికిగానూ రూ.3.50కోట్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. పాకాల టూరిస్టు స్పాట్‌లో కాటేజీల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ప్రతీ పథకానికి, నర్సంపేట పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులను తెవటం జరిగిందన్నారు.

అడ్డుకోవడమే ప్రతిపక్షాల పనిగా మారింది
నియోజకవర్గ అభివృద్ధికి తాను ముఖ్యమంత్రి సహకారంతో కృషిచేస్తుంటే నియోజకవర్గ ఆవిర్భావం నుంచి కూడా పదవులను వెలగబెట్టిన నాయకులు, పార్టీలు ఏనాడూ చేయనంత అభివృద్ధిని తాము చేస్తున్నామని ప్రజలు తెలుపుతున్నారని, ఇది చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు సెగ్మెంట్‌లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని పెద్ది చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేతోపాటు టీడీపీ నాయకులు కాంట్రాక్టులు చేజిక్కించుకుని తమ ప్రభుత్వంలో కూడా పనులు చేయడం లేదని, ప్రజలు తిరగబడుతూ ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా వంటావార్పు చేసి నిరసన తెలుపుతున్నారన్నారు. అయినా ప్రజల కోసం ఆలోచించకుండా అధికారులపై జులుం చెలాయిస్తూ ప్రతీ పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కూటమిలేవైనా వారంతా అభివృ ద్ధి నిరోధకులేనని, టీఆర్‌ఎస్‌కు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని పెద్ది స్పష్టం చేశారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...