ఓటే వజ్రాయుధం


Sat,September 22, 2018 01:51 AM

-జోరుగా ఓటర్ల నమోదు
-జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్ రూరల్ జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. యువత ఎక్కువగా ఓటర్ల నమోదుకు మొగ్గుచూపుతుండగా మార్పులు, చేర్పులు, సవరణలకు కూడా మంచి స్పందన వస్తున్నది. 15న ప్రారంభమైన ఈ నమోదు కార్యక్రమాన్ని 25వరకు కొనసాగిస్తామని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు, 16రెవెన్యూ మండలాలతోపాటుగా ప్రతీ పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించడంతోపాటు విస్తృత ప్రచారాన్ని నిర్వహించి ఓటర్ల నమోదును, సవరణలను ప్రోత్సహిస్తున్నారు. ఓటర్ల ముసాయిదా ప్రకటన తర్వాత జిల్లాలోని అన్ని బూత్ స్థాయిల్లో అవసరమైన నమోదు, సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ఫారాలను ఆర్డీవో, తహసీల్దార్, బూత్‌లెవల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంచారు.

విస్తృత ప్రచారం
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నిరకాల ప్రచారమాధ్యమాలను వినియోగిస్తున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఓటు విలువను, ప్రజాస్వామ్యంలో ఓటు పాత్రను తెలియజేసేలా కార్యాచరణను రూపొందించి అమలుచేస్తున్నది. దీనిలో భాగంగానే గ్రామాల్లో కళాజాత కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. గ్రామాల్లో వాల్‌పోస్టర్లు, టాంటాంలు, ప్రచార వాహనాలు, బ్యానర్లు, పట్టణాల్లో పెద్దపెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది.లోకల్ ఛానళ్లలో ప్రచారం ప్రారంభించింది. 14రకాల పద్ధతుల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. దీనికి ప్రజల్లో ఓటు నమోదు చేసుకోవాలనే ఆలోచనకు కార్యరూపం ఇచ్చింది. సవరణలకు ఎంతో దోహదపడుతున్నది. జిల్లాలోని పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో ఇప్పటికే 386046మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 193293మంది ఉండగా పురుషులు 192119మంది ఉన్నారు. ఇతరులు 34మంది ఉన్నట్లు అధికారులు తమ ముసాయిదాలో ప్రకటించారు.

జిల్లా అధికారులతో ప్రత్యేక కమిటీ
జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా సంయుక్త కలెక్టర్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. ఈ కమిటీకి ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమాలను అప్పగించారు. కలెక్టర్ హరిత ఉత్తర్వులను శుక్రవారం జారీ చేశారు. చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్‌తోపాటుగా అన్ని జిల్లా స్థాయి అధికారులకు ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. జిల్లా అటవీశాఖ అధికారిని నోడల్ ఆఫీసర్, కన్వీనర్‌గా నియమించారు. ప్రచార బాధ్యతలను డీపీఆర్‌వో పల్లవికి అప్పగించారు. ఇక వీరితోపాటుగా 20మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, సవరణల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసే బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...