కేసీఆర్ నాకు స్ఫూర్తి మళ్లీ ఆశీర్వదించండి


Wed,September 12, 2018 03:03 AM

-ప్రజాక్షేత్రంలో టీఆర్‌ఎస్‌దే గెలుపు
-ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి
-కల్యాణలక్ష్మి, రైతు బంధు ఎంతో ఉపయోగం
-పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-పెద్దమ్మగడ్డలో యోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం
దామెర, సెప్టెంబర్ 11: కొండ బద్దలు కొట్టాలి...సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరాలి. నేను అభివృద్ధినే ఆకాంక్షించాను. నీచరాజకీయాలకు పాల్పడలేదు. పేదల సంక్షేమానికి నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఎంతో కృషి చేశాను. నన్ను ఈ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే మన ప్రాంతం,నియోజకవర్గంకూడా వరంగల్ పట్టణానికి తీసిపోకుండా అభివృద్ధి చేస్తా అన్నారు పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి. మంగళవారం వరంగల్ సమీపంలోని పెద్దమ్మగడ్డలో పరకాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతోనే ఎన్నికలకు వెళ్లామని ఏనాడు కూడా సంక్షేమం పట్టని ఆంధ్రపాలకుల చేతివేళ్లు నాకిన కాంగ్రెస్ వంటి పార్టీలు టీఆర్‌ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓర్వలేక అనేక విమర్శలు చేశాయన్నారు. అప్పుడు ఇందిరమ్మ ఇళ్ల భాగోతం, అవినీతి కుంభకోణాలు ప్రజలకు తెలిసినవేనన్నారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ ఎన్నో విమర్శలు చేస్తున్నదని చెప్పారు. కొండ సురేఖ, కొండామురళీ వంటి వారు కూడా పరకాల నియోజకవర్గాన్ని ఎన్నడూ కూడా అభివృద్ధి చేయలేదన్నారు.

స్వార్థంకోసమే సీఎం కేసీఆర్, తాజా మంత్రి కేటీఆర్‌పై వారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కొండలు పలిగేలా ప్రజలు కారుకు ఓటు వేసి గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. కనీవినీ ఎరుగని రీతిలో పరకాలకు రూ.700కోట్ల పైచిలుకు నిధులను తీసుకవచ్చి అభివృద్ధి చేశామని, మెగాటెక్స్‌టైల్ పార్క్‌లను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధిరంగాలకు పెద్దపీట వేశామన్నారు. ఇన్నాళ్లు వలసలకు పోయిన జనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకు తిరిగివస్తున్నారని పేర్కొన్నారు. టీపీఎస్‌ఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహించి ఉద్యోగ అవకాలను కల్పించడం, ఉద్యోగుల వేతనంను పెంచడం, ఆశ, అంగన్‌వాడీల వేతనాలను పెంచి వారి ఇళ్లలో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కరెంటు సమస్య తీరిందని తెలిపారు.

రైతన్నను ఆదుకునేందుకు రైతు బంధు, ప్రతీ ఇంటి ఆడబిడ్డ పెండ్లికోసం కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. హరితహారం, బీడుభూములను సాగు చేసుకునే విధంగా కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, ఐటీ రంగంలో కూడా వివిధ దేశాలకు చెందిన పలు కంపనీలను తీసుకువచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. తండాలు, గూడెలు ఇప్పుడు స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయనడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రగతే కారణమన్నారు. తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం చేసిన ఆంధ్ర పార్టీగా ఉన్న టీటీడీపీతో కాంగ్రెస్ పొత్తుకాగడం సిగ్గుచేటన్నారు.

గతంలో తన వెంట ఎవరూ లేకున్నా కొండాను ఎదిరించి పోరాడానని, ఇప్పుడు తన వెనుక సీఎం కేసీఆర్, ప్రజలు ఉన్నారని, ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ఎంతో మంది ఆడపడుచుల పసుపుతాళ్లు తెంపిన చరిత్ర వారికుందని పేర్కొన్నారు. పరకాలకు దమ్ముంటే కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడిఅభ్యర్థిని ప్రకటించాలని చల్లా డిమాండ్ చేశారు. కొండను కూడా పిండి చేసే దమ్ము, ధైర్యం తనకు ఉందని, ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురికావద్దని చల్లా ధర్మారెడ్డి సూచించారు. పరకాల నియోజవర్గాన్ని రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు ఎటువంటి రౌడీయిజం లేకుండా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు, తమకు ఎంతో స్ఫూర్తిగా ఉన్నారని, అన్నమాటకు కట్టుబడి బంగారు తెలంగాణను నిర్మించేందుకు ఎంతో కృషి చేశారన్నారు.

కొండ పగిలేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తనను గెలిపించి నియోజకవర్గంలో మరింత అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఆలపించిన తెలంగాణ గేయాలు సభికులకు విశేషంగా ఆకర్షించాయి. ఈ సమావేశంలో ఎంపీపీలు సులోచన, గోపు మల్లికార్జున్, వీరగోని కవిత, బొమ్మల కట్టయ్య, మండలపార్టీల అధ్యక్షులు నాగిరెడ్డి, సంపత్‌కుమార్, పోలీస్‌ధర్మారావు, జకీఆర్ అలీ, వెంకటస్వామి, గీసుకొండ పట్టణ అధ్యక్షులు చింతం సదానందం, వినయ్, రైతు సమితి జిల్లా కన్వీనర్ బొల్లె బిక్షపతి, జెడ్పీటీసీలు పాడి కల్పన, అంగోతు కవిత, వీరమ్మ, ఏనుమాముల మార్కెట్ చైర్మన్ కొంపల్లి ధర్మరాజులు, వెంకన్న, గండు రాము, రైతు సమితీ కన్వీనర్‌లు బిల్లా రమణారెడ్డి, సాంబశివరెడ్డి, ఎన్కతాళ్ల రవీందర్, మాధవరెడ్డి, జక్కుల రవీందర్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...