మాజీ ఎమ్మెల్యే గండ్రపై కేసు నమోదు


Wed,September 12, 2018 02:59 AM

-తుపాకీతో బెదిరించాడని క్రషర్ నిర్వాహకుడి ఫిర్యాదు
-మరో క్రషర్ నిర్వాహకుడు రవీందర్‌రావుపైనా కేసు
శాయంపేట, సెప్టెంబర్ 11: భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు అతని సోదరుడు భూపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజబాబు మంగళవారం తెలిపారు. తుపాకీతో బెదిరించాడని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు చెప్పారు. అలాగే క్రషర్ నిర్వాహకుడు ఎర్రబెల్లి రవీందర్‌రావుపైన కూడా తుపాకీతో బెదిరించాడన్న ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు చెప్పారు. ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మాందారిపేట శివారులోని గుట్టల్లో రమణారెడ్డి సోదరుడు భూపాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్‌రావులు కలిసి క్వారీ, క్రషర్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే వీరు ఇటీవల విడిపోయి అదే చోట వేర్వేరుగా క్రషర్లను నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే తన క్రషర్లలోకి రావొద్దని, క్రషర్ తమదేనని మాజీ ఎమ్మెల్యే గండ్రతో పాటు అతని తమ్ముడు భూపాల్‌రెడ్డిలు సోమవారం రాత్రి తనను తుపాకీతో చంపుతామని బెదిరించారని రవీందర్‌రావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయుధ చట్టం ప్రకారం మాజీ ఎమ్మెల్యే గండ్రపై, భూపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే భూపాల్‌రెడ్డి క్రషర్‌కు చెందిన సూపర్‌వైజర్ పరుపాటి గోవర్ధన్‌రెడ్డిని ఇక్కడ పనిచేయవద్దని ఎర్రబెల్లి రవీందర్‌రావు తుపాకీతో బెదిరించినట్లు తెలిపారు. ఈ మేరకు రవీందర్‌రావుపైనా గోవర్ధన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయుధ చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకోవడంతో ముగ్గురిపై కేసు నమోదైనట్లు ఎస్సై వెల్లడించారు. వారి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...