ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి


Tue,September 11, 2018 02:23 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని మొదటగా చెప్పింది తానేనని, ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపై డిమాండ్ పెరుగుతోందని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మొట్టమొదటగా నర్సంపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకాన్ని రైతులకు వర్తింపజేయాలని తాను కోరానన్నారు. 2003లో జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సమయంలో దీనిపై తీర్మానం చేశామని చెప్పారు. ఆ తర్వాత ఈ పథకంపై టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీలో చర్చించి 2008, 2016లో తీర్మానం చేశామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ప్రధాన మంత్రి మోడీని కలిసి ఉపాధిపథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రెండు సార్లు కోరినట్లు చెప్పారు. అలాగే, వివిధ రాష్ర్టాల్లోని ముఖ్యమంత్రులు కూడా ఈ పథకానికి వ్యవసాయానికి వర్తింపజేయాలని కోరుతున్నారన్నారు. ఈ డిమాండ్ ప్రస్తుతం దేశంలో పెరుగుతోందని చెప్పారు. నీతి అయోగ్ కూడా ఇటీవల ఉపాధిహామీని వ్యవసాయానికి కలపాలని సూచించిందన్నారు. దీంతో వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ పనులు చలి, వర్షాకాలంలోనే ఎక్కువగా ఉండడంతో కూలీలు ముందుకు వస్తారన్నారు. ప్రస్తుతం ఉపాధి పనులు వేసవిలో చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అంతేకాకుండా పనులు కూడా తాత్కాలికంగానే ఉంటున్నాయన్నారు. వ్యవసాయ పనులకు అప్పగించడం వల్ల రైతులే మస్టర్లు నిర్ణయించే అధికారం వస్తుందని చెప్పారు. పనిదినాలకు సంబంధించిన అధికారాలను రైతులకు అప్పగిస్తారని తెలిపారు. ఉపాధిహామీ పథకంపై నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని పెద్ది తెలిపారు. గ్రామంలో బాక్స్ పెట్టి రైతుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. వాటితో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేస్తామని వివరించారు. ఈ ప్రక్రియ బలమైన శక్తిగా ఉపయోగపడుతుందన్నారు. కనీస వేతన చట్టం అమలుకు వీలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, వైస్‌చైర్మన్ మునిగాల పద్మవెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, చిలువేరు రజనీ భారతి, దార్ల రమాదేవి, రాజేశ్వర్‌గౌడ్, కుమారస్వామి, యువరాజు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...