కారు జోరు.. ప్రతిపక్షాల బేజారు


Sun,September 9, 2018 03:08 AM

-జనం మధ్య టీఆర్‌ఎస్ నాయకులు
-సెగ్మెంట్‌కు దూరంగా.. అయోమయంలో ప్రతిపక్షాలు
-ఖరారుకాని అభ్యర్థిత్వాలతో ప్రతిపక్షాల పరేషాన్
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కారు స్పీడుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఆనందం, ఉత్సాహం నెలకొని ఉండగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంలో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ రద్దు రోజే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఆ పార్టీలో నూతన జోష్ నెలకొంది. గులాబీ శ్రేణులు ముందస్తు అభ్యర్థుల ఖరారుతో సంతోషకర వాతావరణంలో ఎన్నికలకు సై అంటూ తమవంతు బాధ్యతలను నెరవేరుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఇద్దరు సిట్టింగ్‌లను, ఒక స్థానంలో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌ల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. దీంతో టీఆర్‌ఎస్ తన పార్టీపరమైన కార్యక్రమాలను మరింత ఉధృతం చేసింది.

జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన సిట్టింగ్‌లు, అభ్యర్థులు ధర్మారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌లు శాసనసభ రద్దయి లిస్టు ప్రకటించిన మరుక్షణం నుంచే కార్యక్షేత్రంలో దిగారు. నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో చేసిన ప్రతీ అభివృద్ధిని పల్లెపల్లెనా ప్రచారం చేసేలా కార్యకర్తలను సిద్ధం చేసి పంపారు. దీంతో టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డుసభ్యులు, బూత్ కమిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీపరంగా ఖరారైన అభ్యర్థుల పరంగా ప్రతీ పనిని గ్రామంలో ప్రత్యక్షంగా చూపిస్తూ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారం, టీఆర్‌ఎస్ నాయకులు నిర్వహిస్తున్న ముందస్తు కార్యక్రమాలు సంపూర్ణ రాజకీయ ఎన్నికల ప్రచారాన్ని తలపింపచేస్తున్నది. రద్దు, అభ్యర్థుల ప్రకటన, హుస్నాబాద్‌లో సభ విజయవంతంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందోత్సవాల మధ్య ఉరకలు వేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే సమన్వయ కమిటీల బాధ్యులు పనిచేస్తున్నారు.

ప్రచార వాహనాలు సిద్ధం
నియోజకవర్గంలో అభ్యర్థులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూనే ఆశీర్వదించండని ప్రజల మధ్యకు వెళ్లి కోరుతున్నారు. ఈ వ్యవహారంలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌లు ముందువరుసలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా ఈ మూడు రోజులుగా సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల వాహనాలు నియోజకవర్గాలకు చేరడంతో టీఆర్‌ఎస్‌లో ఎన్నికల మూడ్ వచ్చేసింది.

బిజీబిజీగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు
ముందస్తు ఎన్నికలు ఖరారు కావడం, అసెంబ్లీ రద్దుతోపాటు అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సిట్టింగ్‌లు, అభ్యర్థులు జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఒక్కక్షణం కూడా వృథా చేయకుండా విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీ అయ్యారు. పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముగించడంతోపాటు ప్రతీ చిన్న కార్యక్రమానికి కూడా హాజరవుతూ ఎక్కువ మొత్తంలో ప్రజలను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేటలో అరూరి రమేశ్‌లు అదే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా పరకాల తాజా మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి శనివారం తన పుట్టినరోజును పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేయగా నియోజకవర్గంలోని పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, సంగెం, గీసుకొండ మండలాల కార్యకర్తలు, నాయకులు 2వేల మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపి రక్తదానం చేశారు. ఇలా ప్రతీ అభ్యర్థి ప్రతీరోజు క్షణక్షణం ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహిస్తూ, పాల్గొం టూ ఎన్నికల వేడి రగిలించారు.

పట్నం వదలని ప్రతిపక్ష నాయకులు
ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్నం వదిలి ఇప్పటివరకు జిల్లాలకు కూడా చేరుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభను రద్దు చేసినరోజే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాని లో వరంగల్ రూరల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అధికారపార్టీ తన పారదర్శకతను ప్రకటించగా అభ్యర్థిత్వాలు కూడా ఖరారు కాని ప్రతిపక్ష పార్టీలు బేజారవుతున్నాయి. ఈ మూడు సెగ్మెంట్లలోని నాయకులు తమకంటే తమకు టికెట్ అంటూ హైదరాబాద్‌లోనే ఉండి పైరవీలు చేసుకుంటున్నారు. కానీ అందుకు ధీటుగా టీఆర్‌ఎస్ సెగ్మెంట్‌లోని ప్రజల మధ్యన ఉంటూ ఉత్సాహభరిత వాతావరణంలో ముందస్తువైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...