రాజకీయ వేడి..!


Sat,September 8, 2018 02:19 AM

-సమరానికి సిద్ధమవుతున్న శ్రేణులు
-ఊరూరా టీఆర్‌ఎస్ ర్యాలీలు, ప్రదర్శనలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్ రూరల్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చైతన్యం కలిగిన జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి దఫాలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్‌లు కాగా మరొకరు నియోజకవర్గ ఇన్‌చార్జి. నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఊరూరు తిరిగి పార్టీ శ్రేణులు, ప్రజల్లో మమేకమైన వారికి అందరు ఊహించినట్లుగానే టికెట్లు రావడం, ఆ తెల్లవారే పక్కనేగల హుస్నాబాద్‌లో కేసీఆర్ బహిరంగ సభ జరుగడం, ఆ సభకు వేలాదిగా ప్రజలు ఈ మూడు నియోజకవర్గాల నుంచి తరలివెళ్లడం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్ శ్రేణులు సమరానికి సైఅంటూ సిద్ధం కాగా ప్రతిపక్ష అభ్యర్థులకు దిమ్మదిరిగింది. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జులు, గతంలో ఓడిపోయిన వారు ఎవరు కూడా నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడంలేదు. టికెట్‌ను ప్రకటించిన 24గంటల్లోగా జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు ఊరూరా టీఆర్‌ఎస్ జెండాలను ఎగురవేశాయి. మూడు నియోజకవర్గాల్లోని 16మండలాలు, 401 గ్రామపంచాయతీల్లో మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ శుక్రవారం నాటి సభకు తరలివెళ్లొచ్చారు.

ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా అభ్యర్థిత్వాలను ముఖ్యమంత్రి ఖరారు చేసిన విషయం విదితమే. చల్లా ధర్మారెడ్డి సిట్టింగ్ కావడం, ఆయనకే టికెట్ ఖరారు చేయడంతో పరకాల మండల, పట్టణ నాయకులు సంబరాలను చేసుకున్నారు. ఇక ఆత్మకూరులో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ దాదాపు 300మందితో టీఆర్‌ఎస్‌లో చేరారు. నర్సంపేట నియోజకవర్గంలో అక్కడి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డికి శుక్రవారం నర్సంపేటలో ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు మోటార్‌సైకిళ్లతో ర్యాలీగా వచ్చి నర్సంపేటలో ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా గిర్నిబావి వద్ద టపాసులు పేల్చారు. చెన్నారావుపేట మండలంలో కూడా సంబరాలు జరుపుకున్నారు. వర్ధన్నపేటకు చెందిన కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పరకాలలో స్పీకర్ సిరికొండ మధుసుదనాచారికి అక్కడి విశ్వబ్రాహ్మణుల సంఘం, స్థానిక టీఆర్‌ఎస్ శ్రేణులు అంబేద్కర్ సెంటర్‌లో ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా స్పీకర్ పరకాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు శాయంపేట మండలం తహరాపూర్ రహదారిపై సైకిల్‌మోటార్ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ర్యాలీలు, ప్రదర్శనలు, చేరికలతో హోరెత్తిపోయింది.

రచ్చబండపై చర్చ
జిల్లాలో అప్పుడే రచ్చబండపై చర్చ జరుగుతున్నది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలే 98శాతం ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్వహించిన ప్రగతి నివేదన సభ, ఆ తర్వాత శుక్రవారం రూరల్ జిల్లాకు సమీపంలో హుస్నాబాద్‌లో ఆశీర్వాద సభ నిర్వహించడంపై జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామంలో రచ్చబండపై గ్రామ చావడిల వద్ద చర్చ జరుగుతున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడం నుంచి మొదలుకొని గ్రామంలో జరుగుతున్న, జరిగిన అభివృద్ధి పనులు, కేసీఆర్ ప్రకటించిన భవిష్యత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై చర్చ పెడుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు మరోఅడుగు ముందుకేసి కేసీఆర్ చెప్పినట్లుగా శాసనసభ రద్దుకు దారితీసిన కారణాలపై కూడా ప్రజలను చైతన్యం చేయడం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో అనుకున్న అభ్యర్థులకే టికెట్లు ప్రకటించడంతో యువకులు, మహిళలు, కార్మిక కర్షకులు రచ్చబండపై చర్చపెడుతూ ప్రతిపక్షాలను నిలదీసే పనిలో నిమగ్నమయ్యాయి.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...