టీఆర్‌ఎస్ సంబురాలు


Fri,September 7, 2018 02:31 AM

-ప్రతిపక్షాలకు షాక్
-ఉత్కంఠకు తెర
-సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్
-సర్వత్రా హర్షం
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్ రూరల్ జిల్లాలో టీఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభను రద్దు చేస్తూ అదే సమయంలో 105మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో రూరల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అందరూ ఊహించినట్లుగానే ఇద్దరు సిట్టింగ్‌లకు, ఒక నియోజకవర్గ ఇన్‌చార్జికి టికెట్లు దక్కాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. జిల్లాలో మూడు నియోజకవర్గాలు, 401 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోని పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలు మూడు ఆదినుంచి టీఆర్‌ఎస్‌కు పెట్టనికోటలు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది ఉద్యమనేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచాయి. స్వరాష్ట్రం సిద్ధించాక సంబురపడ్డ జిల్లావాసులు సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు. దీనిలో భాగంగానే 2014లో కూడా వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్‌కు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. ఆ తర్వాత అభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరిన చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డిలకు మంచి ప్రాధాన్యత కల్పించడంతోపాటు నియోజకవర్గాల అభివృద్ధికి విరివిగా నిధులను మంజూరు చేశారు. పథకాలను కూడా క్షేత్రస్థాయిలో అమలుచేసి పారదర్శకంగా అందేలా చూశారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో 70ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో సాధించని ప్రగతిని సాధించుకోగలిగారు. ఫలితంగా ప్రతీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి మరింత పటిష్టంగా తయారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంతోపాటుగా ప్రతిపక్షాలకు ధీటైన సమాధా నం చెప్పి ప్రజల పక్షాన నిలవాలనే సంకల్పంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యా రు. మూడు నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అభ్యర్థుల విషయంలో పార్టీశ్రేణులు ఊహించినట్లుగానే ముఖ్యమంత్రి పరకాల నియోజకవర్గంలో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డికి టికెట్లను ఖరారు చేస్తూ జాబితాలు ప్రకటించారు. ఆ వెనువెంటనే వీరిని హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు రావాలని ఆదేశించడంతో సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌లు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు.

జిల్లాలో మిన్నంటిన సంబరాలు
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ రద్దు చేయడంతోపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిపక్షాల వైఫల్యాలను, రాక్షసత్వాన్ని ఎత్తిచూపారు. అంతేకాకుండా జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట శాసనసభ్యుల అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ఇప్పటికే సిట్టింగ్‌లైన ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌తోపాటు పెద్ది సుదర్శన్‌రెడ్డిలకు టికెట్లు ప్రకటించడంతో జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల పరిధిలోని 16మండలాల్లో, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో టీఆర్‌ఎస్ పార్టీశ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అన్ని మండల కమిటీలు, పట్టణ కమిటీలు, గ్రామ కమిటీలు మిఠాయిలు పంచుకున్నాయి. ప్రధాన కూడళ్లలో టపాసులు పేల్చాయి. టీఆర్‌ఎస్ కండువాలు వేసుకుని జెండాలు చేతబూని ఉత్సాహభరిత వాతావరణంలో ఆదివారం రాత్రి వరకు రోడ్లపై అక్కడక్కడ ప్రదర్శనలు చేశాయి. అభ్యర్థిత్వాలపై ఉత్కంఠకు తెరపడడం, ఊహించినట్లుగానే టికెట్లు ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేవు.

అయోమయంలో ప్రతిపక్షాలు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఏకకాలంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో మరోసారి విజయపతాకను ఎగురవేస్తామంటూ టీఆర్‌ఎస్ శ్రేణుల హడావుడి చేశాయి. సందేహాలకు తావులేకుండా అభ్యర్థులను మొదటిదఫా జాబితాలోనే ప్రకటించడంతో ఇప్పటికే మీమాంసలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చినట్లయింది. ఈ మూడు సెగ్మెంట్లలో మిగతా పార్టీలన్నీ బిత్తరపోయాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో ప్రతిపక్ష పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన, టీఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలను చూసి ప్రతిపక్ష పార్టీలు షాక్‌కు లోనయ్యాయి.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...