ఉపాధ్యాయులు ఆదర్శనీయులు


Thu,September 6, 2018 01:28 AM

-రాజకీయాల్లోకి రాకుంటే లెక్చరర్ అయ్యేవాడిని
-ఎందరో మహానుభావులు నాకు గురువులయ్యారు
-స్పీకర్ సిరికొండ

శాయంపేట, సెప్టెంబర్ 5 : సమాజానికి ఉపాధ్యాయులు ఆదర్శనీయులని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్‌లో బుధవారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వేపల్లి చిత్రపటం వద్ద జ్యోతి వెలగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను స్పీకర్ శాలువా, మెమోంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గదర్శకుడిగా నిలిచే ఉపాధ్యాయ వృత్తి ఎన్నో జన్మల పుణ్యం చేస్తేగాని లభించదని అలాంటి వృత్తిలో ఉన్నవారు ఆదర్శనీయులన్నారు. రాజకీయాల్లోకి రాకుండా ఉంటే లెక్చరర్ ఉద్యోగంలో ఉండేవారినన్నారు. ఉపాధ్యాయ లోకం చేసే సేవ మహోన్నతమైందన్నారు. నేను చేసుకున్న పుణ్యం వల్ల మహానుభావులు నాకు గురువులయ్యారని, రత్నాలాంటి ఉపాధ్యాయుల వద్ద విద్యాబోధన చేసినట్లు చెప్పారు. ఈ స్థాయిలో ఉన్నానంటే గురుదేవులు అందించిన ఆశీస్సులేనన్నారు. తన ఊరు నర్సక్కపల్లిలో చదువుకున్నప్పుడు మా హెచ్‌ఎం రాజవీరయ్య, నకడికూడలో లింగారెడ్డి, హుస్నాబాద్‌లో డీవీఆర్‌లు చదువు చెప్పారని ఇప్పటికీ ఆ రూట్‌లో వెళ్లితే వారి ఆశీస్సులు తీసుకుంటానన్నారు. గొప్ప సమాజంలో మనం ఇంత బాధ్యతగా పనిచేస్తే ఏడాదికి ఒక్క శాతం అక్షరాస్యతను పెంచలేకపోయారన్నారు. విద్యా విషయంలో కేసీఆర్ అద్భుతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వందల గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శాయంపేట మండలం రూరల్ జిల్లాలో ఉందని భూపాలపల్లి జిల్లా ఫండ్ రూ.5కోట్లు ఇచ్చామని కానీ వేరే జిల్లా లో ఉండటం వల్ల నిధులు అందలేదన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ బాసాని రమాదేవి, ఎంఈవో మాదాడి రాజిరెడ్డి, తహసీల్దార్ వెంకట్‌భాస్కర్, ప్రత్యేక అధికారి హరిప్రసాద్, ఈవోపీఆర్‌డీ సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : జెడ్పీ చైర్‌పర్సన్

హన్మకొండ,నమస్తేతెలంగాణ: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైందని ఆ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అర్బన్, రూరల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల విద్యాశాఖాధికారి కె.నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. మొదటగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారని వారిని నాణ్యమైన విద్యను అందించి సర్వత్రా ఆదర్శంగా నిలువాలన్నారు.బంగారు తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం.హరిత మాట్లాడుతూ గురువుల వృత్తితో సమాజాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులపై విద్యార్థులను తయారు చేసే గురుతరమైన బాధ్యత ఉందని సాంకేతిక మార్పుల ప్రభావం సమాజంపై ఉంటుందని ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు మాట్లాడుతూ ప్రతి వేదిక వ్యవస్థ మార్పునుకు నాంది కావాలని ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యా బోధన సాధించాలని విజ్ఞప్తి చేశారు. డీఈవో నారాయణరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకొని సామాజిక మార్పుల కోసం ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూరల్ జిల్లాలో 41మంది ఉపాధ్యాయులకు, 8స్వచ్ఛ పురస్కార్ అవార్డు పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు.

అలరించిన విద్యార్థుల నృత్యాలు

గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురుని అలరింపజేశాయి. ఈ సమావేశంలో ప్రాక్టీసింగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిక్షపతి, అక్బర్, సెక్టోరియల్ అధికారులు వేణు, ఆనంద్, మనోజ్‌కుమార్, రమాదేవి, సంధ్యారాణి, సంపత్, వల్సపైడి, రెహమాన్, స్వామి, కృష్ణమూర్తి, రాధా, నెహ్రూ, మహదేవ్, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సన్మానం

ఆత్మకూరు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు కాంతాల మాధవరెడ్డి, చంద్రమౌళిలను జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇద్దరికి సన్మానం చేశారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వపాఠశాలను అన్నిరంగాలల్లో అభివృద్ధి ్ద చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్, జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, పాఠశాల హెచ్‌ఎంలు కర్ర శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...