గ్రామసభలే వేదిక


Tue,November 12, 2019 04:15 AM

-ఉపాధికి మరింత ఊతం
-ప్రారంభమైన కార్యాచరణ
-95 రకాల పనులతో జాబితా
-జిల్లాలో 1,31,246 జాబ్‌కార్డులు
-వచ్చే ఏడాదికి మొదలైన కసరత్తు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలకు మరింత బాధ్యత పెరుగుతున్నది. గతంలోను గ్రామ పంచాయతీలకు ఉన్న బాధ్యతలకు మించి నేడు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. గ్రామంలో చేపట్టాల్సిన పలు రకాల పనులను గుర్తించడానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులు, సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. ఉపాధి హామీల ద్వారా చేపట్టాల్సిన పనులన్నిటిని గ్రామ సభల్లోనే గుర్తించాల్సి ఉన్న క్రమంలో సందడి షురూ అయింది. 2020-21కి సంబంధించిన ప్రణాళికకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీకారం చుట్టింది. కాగా, జిల్లాలో ఉపాధి హామీకి సంబంధించి 14 మండలాల్లో 255 గ్రామ పంచాయతీల ద్వారా పనులు కొనసాగుతున్నాయి. వీటిలో జిల్లా వ్యాప్తంగా 1,31,246 జాబ్ కార్డులుంటే, శ్రమ శక్తి సంఘాలు 6081 గ్రూపులు, కూలీలు 2,87,244, 2019-20కి సంబంధించి 31లక్షల పనిదినాలుండగా, 21 లక్షల పనిదినాలను పూర్తి చేశారు. దాదాపు 37 కోట్ల రూపాయల పనులను ఇప్పటి వరకు జిల్లాలో ఉపాధి హామీలో జరిపించారు.

గ్రామ సభలు షురూ
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా పనులను గుర్తించేందుకు ప్రాధాన్యత ఉండేది. అయితే, ఇప్పుడు తప్పనిసరిగా గ్రామ సభలో గుర్తించిన పనులను మాత్రమే పరిగణలోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గ్రామ, గ్రామాన సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలో ఉపాధి పనులు అవసరమైన ప్రజలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. అనంతరం ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలించి ప్రతిపాదనలు చేసేలా కార్యక్రమం జరుగుతున్నది. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఏ ఒక్క ఉపాధి హామీ పని ముందుకు వెళ్లడం సాధ్యంకాని రీతిలో ప్రస్తుత కార్యాచరణ కొనసాగుతున్నది. పనులు చిన్నవైనా.. పెద్దవైనా ప్రతిపనికి జీపీ తీర్మానం తప్పనిసరి అయింది.

జాబితాలో ఉన్న పనులను గుర్తించాలి
ఉపాధి హామీ పనుల్లో చేపట్టాలనుకునే పనులను ముందే గుర్తించి ఓ జాబితాను రూపొందించారు. గతంలో ఉన్న వాటిని కొంత సవరించి నూతనంగా గుర్తించారు. ప్రస్తుతం 95 రకాల పనులను ఎంపిక చేశారు. ఈ జాబితాలను ఇటీవల గ్రామ సర్పంచులకు కూడా అధికారులు అందించారు. ఈ జాబితాలో నిర్మాణాత్మక, సాధారణ పనులు కూడా ఉన్నాయి. మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం, శ్మశాన వాటికలు, సామాజిక భవనాలు, గ్రామ పంచాయతీ భవనా లు, సీసీ రహదారులు, మట్టిరోడ్లు, కందకాల నిర్మా ణం, చెక్‌డ్యాంలు, పశువుల నీటితొట్లు, డంపింగ్ యా ర్డులు, ఫారం ఫాండ్, మట్టికట్టలు, చిన్న ఊట కుంట లు, బావుల పూడికతీతలు, పంట నూర్పిడి కల్లాలు, ఊ ట కుంటలు, కోళ్లఫారం, పుశువుల పాకలు తదితర ప నులను జాబితాలో చేర్చారు. రైతులకు ఎక్కువగా ఉపయోగపడే పనులు వీటిలో ఉన్నాయి. గ్రామం యూనిట్‌గా ప్రజలందరికీ అవసరమైన పనులతోపాటు వ్యక్తిగత ఉపయోగం కలిగించే పనులు అనేకం ఉన్నాయి. ప్రణాళికలో పొందుపరిచిన పనులను మాత్రమే ఉపాధి హామీ ద్వారా చేపట్టడానికి అవకాశం ఉంది.

2020-21కి కార్యాచరణ
2020-21కి సంబంధించిన పనులను గుర్తించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. ఇందుకు గ్రామ సభల ద్వారానే ఉపాధి హామీ పనులను చేపట్టేందుకు కార్యాచరణను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలనే లక్ష్యం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ సభలను ప్రారంభించారు. మిగిలిన వాటిలోను సభలను ఈ నెల చివరికల్లా పనులు అవసరమున్న ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీలో చేపట్టబోయే పనులను వాటి ప్రాధాన్యం ప్రకారం ఎంపిక చేయడానికి తొలిసారి ప్రజా ప్రతినిధులకు అవకాశాన్ని కల్పించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలతోపాటు మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులకు పనులను ఎంపిక చేసేందుకు తగిన ప్రాధాన్యాన్ని కల్పించారు. ఈ నెలాఖరు వరకు గ్రామ సభలు పూర్తి చేసి 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి పనులకు కార్యాచరణను రూపొందించనున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...