బీమాతో ధీమా


Sun,November 10, 2019 01:43 AM

-591 మంది రైతు కుటుంబాలకు పరిహారం
-మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున
-జిల్లాలో నమోదు చేసుకోవాల్సింది 18 వేల మంది
-రెండేళ్లలో రూ.27 కోట్ల పరిహారం పంపిణీ

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అన్నదాతలకు అండ గా నలిచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. వీటిలో రైతుబీమా పథకం ప్రదానంగా నిలుస్తున్నది. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో ఉన్న రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా సొమ్మును చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, ఇలా రైతులకు మేలు చేయాలని తలచిన పథకంలోనూ చేరడానికి అన్నదాతలు ముందుకు రాకపోవడం బాధాకరం. చాలా మంది రైతులు ఈ పథకానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. అనేక దఫాలు గ్రామాల్లో ప్రచారం చేసినా రైతులు ఇంకాను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పేద రైతులు కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో చనిపోవడం వారికి బీమా సౌకర్యం అందకపోవడంలాంటి సమస్యలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి.

పెండింగ్‌లో 18 వేల మంది రైతులు
జిల్లాలోని 14 మండలాలలో దాదాపు 18,542 మంది రైతులు బీమా పథకంలో అర్హత ఉండి కూడా చేరడం లేదు. మొత్తం జిల్లాలో 1,45,867 మంది రైతులున్నారు. వీరిలో బీమా పథకానికి అర్హత ఉన్న రైతులు మొత్తం 82,011 మంది ఉన్నారు. మరో 45,314 మంది రైతులు బీమా పథకానికి అర్హతలేని వారున్నారు. కాగా, ఇప్పటి వరకు ఇంకా జిల్లాలో 18,542 మంది అర్హత ఉన్న రైతులు బీమా పథకంలో చేరాల్సి ఉంది. ఇప్పటికి అనేక దఫాలు గ్రామాల్లో చెబుతున్నా రైతులు ముందుకు రావడం లేదు. వివిధ కారణాల పేరుతో నమోదును వాయిదా వేస్తున్న అన్నదాతల కుటుంబాలు ప్రభుత్వం కల్పించిన బీమా పథకాన్ని అందుకోలేకపోతున్నాయి.

రెండు నిమిషాల్లోనే నమోదు..
బీమా పథకంలో చేరేందుకు భూ యజమాని పట్టా పాసుపుస్తకం, అధార్ కార్డు, నామినీగా భార్య లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి ఆధార్‌కార్డు జీరాక్స్ పేపర్లను సంబంధిత వ్యవసాయాధికారికి ఇవ్వాలి. వ్యవసాయాధికారులు లేనప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారికి కూడా ఇవ్వవచ్చు. నమోదు చేసుకోని వారి వివరాలు ఆయా మండల వ్యవసాయాధికారుల వద్ద పూర్తి సమాచారం ఉంటుంది. చాలా వరకు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సభలు జరిగినప్పుడు బీమా విషయం చెప్పిన రైతులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా బీమా చేయించని రైతులు వివిధ జీరాక్స్ పేపర్స్‌తో వ్యవసాయ కార్యాలయానికి చేరుకుంటే కేవలం రెండు నిమిషాల్లో బీమాలో చేరిపోయేందుకు అవకాశం ఉంటుంది.

రెండేళ్లలో 27 కోట్ల పరిహారం పంపిణీ
రైతుబీమా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని బాధిత రైతు కుటుంబాల వారికి దాదాపు 27కోట్ల రూపాయల పరిహారం అందింది. జిల్లాలోని వివిధ మండలాల్లో దాదాపు 591మంది రైతుల కుటుంబాలకు ఈ పథకం మేలు చేసింది. ఇంకాను 48 మంది బాధిత రైతు కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే, 2018-19లో 479 మంది రైతులు చనిపోతే, 2019-20లో 112మంది రైతులు ప్రమాదాల్లో చనిపోయారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...