నైపుణ్యంతో ముందడుగు


Thu,November 7, 2019 01:41 AM

-స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో సత్ఫలితాలు
-రాష్ట్రంలోనే తొలిసారిగా పాలమూరులో..
-స్వల్ప వ్యవధి.. తక్కువ ఫీజుతో శిక్షణ
-ఎనిమిది అంశాల్లో ట్రైనింగ్
-కోర్సు సర్టిఫికెట్లతో ఉద్యోగావకాశాలు
-స్వయం ఉపాధికీ రుణాలు

మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్వల్ప వ్యవధిలో, తక్కువ ఫీజులతో నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 2న దీనిని ప్రారంభించారు. తొలి బ్యాచ్‌కు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ అందించాలని నిర్ణయించింది. ప్రైవేటులో వేలాది రూపాయల ఫీజు వసూలు చేసే కోర్సులకు ఇక్కడ రూ.1500 నుంచి రూ.2500 లోపే నిర్ణయించారు. ప్రతి కోర్సుకు కేవలం 30 సీట్లు మాత్రమే ఉండటంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారికి మాత్రమే ఎవరు ముందు వస్తే వారికే ప్రాధాన్యం ఇస్తూ సీట్లు భర్తీ చేస్తున్నారు.

పాలమూరులోనే తొలికేంద్రం
తొలి విడతగా రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి కూడా అయిన వి.శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మహబూబ్ నగర్‌లో రాష్ట్రంలోనే తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. రూ. 60 లక్షలతో కలెక్టరేట్ వెనుక వైపున ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ఏడుగురు శిక్షకులతో దీనిని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 184 మంది నిరుద్యోగులు కోర్సులో చేరారు.

మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన
ఈ కేంద్రాల్లో మహిళలు ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ మేకింగ్, జర్దోసి, ఎంస్ ఆఫీస్ వంటి కోర్సుల ద్వారా ఉపాధి పొందేందుకు చేరుతుండటం విశేషం. వీటిని నేర్పేందుకు బయట భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంతో పేద, మధ్య తరగతి మహిళలు ఇక్కడ నేర్చుకొనేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.

ఉద్యోగావకాశాలు.. ఉపాధి
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కోర్సు పూర్తయ్యాక వీరిచ్చే సర్టిఫికెట్‌కు మంచి గుర్తింపు ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ కోర్సు నేర్చుకుంటే ప్రైవేటు సంస్థల్లో పార్ట్ టైం, రెగ్యులర్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీసింగ్, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్, మొబైల్ సర్వీసింగ్ కోర్సుల ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నది. దీంతో పాటు బ్యాంకుల ద్వారా కుట్టు మిషన్లు, దుస్తుల తయారీ, బ్యూటీషియన్ కోసం రుణాలు తీసుకుని ఇంటి వద్దే ఉపాధిపొందవచ్చు. ఇక్కడ నేర్చుకున్న పలు కోర్సులతో విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చునని పలువురు పేర్కొంటున్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...