నల్లచెరువు నవ్వింది


Wed,November 6, 2019 02:24 AM

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘నల్ల చెరువులో 365 రోజులూ నీళ్లుండాలి. ఆధునిక జీవనానికి నల్ల చెరువు నాంది పలకాలి. పాత పట్టణమంతా కొత్తశోభను సంతరించుకోవాలి. దశాబ్దాల తరబడి నీటికి నోచుకోని చెరువులన్నింటికీ కృష్ణానీటిని తరలించి సస్యశ్యామలం చేస్తాం. జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ సాగునీరందించి తీరుతాం’ అన్న మాటలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి రుజువు చేశారు. 2017 నవంబరు 5వ తేదీన నల్లచెరువు (మినీ ట్యాంక్‌ బండ్‌) పనుల శంకుస్థాపనలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో నిరంజన్‌రెడ్డి అన్న మాటలివి. చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఎంజీకేఎల్‌ఐలోని డీ-8 కాలువ ద్వారా మినీ ట్యాంక్‌బండ్‌కు నీటిని సరఫరా చేసి నగుమోములో నల్లచెరువును పట్టణవాసులకు చూపిస్తున్నారు.

అలుగుపారిన నల్లచెరువు..
నాలుగు దశాబ్దాలుగా కంప చెట్లకు నెలవైన నల్ల చెరువు నేడు నిండుకుండను తలపిస్తున్నది. రాష్ట్ర సాధన అనంతరం రాష్ట్రంలోని చెరువుల స్వరూపం మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల చెరువులుంటే, వాటన్నిటిని మిషన్‌ కాకతీయ పథకం ద్వారా అభివృద్ధి చేయడం గొప్ప మార్పునకు సాంకేతంగా నిలుస్తున్నది. అలాగే ప్రతి నియోజకవర్గంలో అవకాశం ఉన్న చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా ఏర్పాటు చేయిస్తున్న ప్రభుత్వం వాటిని నీటితోనూ నింపేలా చొరవ తీసుకున్నది. ఇందులో భాగంగా ఇక్కడి నల్లచెరువును మినీట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దాదాపు రూ.6.50 కోట్లను మంజూరు చేసింది. ఇక ఈ పనులను చివరి దశకు చేరుకోగా, నేడు నల్ల చెరువు స్వరూపమే మారిపోయింది. దశాబ్దాలుగా ఎండిన చెరువు నేడు కృష్ణమ్మ నీటితో వారం రోజుల నుంచి అలుగు పారుతున్నది. ఆయకట్టు పరంగా చూస్తే.. ఇప్పుడు వ్యవసాయానికి అనువుగా లేకపోయినా.. మినీట్యాంకుబండ్‌ ద్వారా పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచనున్నది. కాగా, వర్షాధారంపైన ఆధారపడ్డ నల్లచెరువుకు ఎంజీకేఎల్‌ఐలోని డీ-8 కాలువ ద్వారా కృష్ణా నీటిని తరలించడం గొప్ప మార్పునకు సాంకేతంగా నిలిచింది.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...