15 నుంచి ధాన్యం కొనుగోళ్లు


Wed,November 6, 2019 02:18 AM

వనపర్తి క్రీడలు : ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్వేతామొహంతి అన్నారు. మంగళవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేపీ ద్వారా 69, పీఏసీఎస్‌ల ద్వారా 40, మెప్మా ద్వారా 2, మొత్తం 111 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 1.98లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్‌ ఏ రకం క్వింటాలుకు రూ.1835 లు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతుల పొందడం, అలాగే వరి ధాన్యాన్ని అమ్మటంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ధాన్యం తూకం వేసే యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, రైతులు అమ్మిన ధాన్యం వివరాలు, చెల్లింపులు ఆన్‌లైన్‌ ద్వారా చేస్తున్నందున వాటన్నింటిని నమోదు చేసేందుకు అవసరమైన ట్యాబ్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నెల 9వ తేదీన ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా సిబ్బంది అందరికీ ట్యాబ్‌లపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలు కోసం 53.50లక్షల గన్నీ సంచులు అవసరం కాగా, వాటిని విడతల వారిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 12.24లక్షల గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పారు. మొదటి విడతగా 20 లక్షల గన్నీ సంచులు అవసరం ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వెంకటయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ లక్ష్మయ్య, డీఎస్‌వో రేవతి, డీఆర్డీవో గణేశ్‌, మార్కెటింగ్‌ ఏడీ స్వర్ణసింగ్‌, జిల్లా వ్యవసాయ అధికారి శివనాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి కొదండరాములు, మున్సిపల్‌ కమిషనర్‌ రజనీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...