అభివృద్ధిలో..భాగస్వాములను చేయాలి


Sat,November 2, 2019 01:29 AM

-షెడ్యూల్డ్ కులాల వారిని కలుపుకోవాలి
-గ్రామాల్లో సమానత్వం కోసం కృషి చేయాలి
-సంక్షేమ పథకాలను సక్రమంగా అందేలా చూడాలి
-జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు
-అన్ని శాఖల అధికారులతో సమీక్ష

వనపర్తి, నమస్తే తెలంగాణ : అభివృద్ధిలో షెడ్యూల్డ్ కులాల వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారి సంక్షేమంతో పాటు అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తిలోని తరుణి ఫంక్షన్‌హాల్‌లో అన్ని శాఖల అధికారులతో షెడ్యూల్డ్ కులాల వారి సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న సమీక్ష కార్యక్రమాలపై సమీక్షను నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల వారి సంక్షోమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, అవి సక్రమంగా వారికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, షెడ్యూల్డ్ కులాల వారికి ఆపిన, నిర్లక్ష్యం చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల వారిపై దాడుల కేసుల విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే 25శాతం, ఛార్జిషీట్ సమయంలో 50 శాతం, చివరలో వంద శాతం నష్ట పరిహారం చెల్లించాలని, రేప్ కేసు విషయంలో మొత్తం ఎనిమిదిన్నర లక్షల రూపాయలను విడతల్లో ఇవ్వాలని, బాధితులకు ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విషయాలలో ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే అందుకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని, వారికి ఎలాంటి స్టేషన్ బెయిల్ ఇవ్వవద్దని అన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఎట్టి పరిస్థితులలో రాజి పడవద్దని, ఈ విషయమై ఇటీవల సుప్రీం కోర్టు ఉత్తుర్వులు కూడా జారి చేసినట్లు ఆయన తెలిపారు.

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఈ విషయంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. గ్రామాలలో సమానత్వం కోసం అందరు కృషి చేయాలని ముఖ్యంగా అస్పృశ్యత, అంటరానితనం వంటివి తలెత్తకుండా ముందుగానే సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలని చెప్పారు. గ్రామాలలో పౌరహక్కుల దినాన్ని నిర్వహించాలని సూచించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ షెడ్యూల్డ్ కులాల సంక్షమం, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ తదితర ముఖ్యమైన శాఖ ద్వారా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కృషి చేయడంలో సంబంధిత అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన సూచించారు. పట్టణ ప్రాంతాలలోని ఎస్సీల అభివృద్ధికి మున్సిపాలిటీ ద్వారా వాణిజ్య సముదాయాలను నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఎస్సీల కులవృత్తి చెప్పులు కుట్టడం ఇటీవల చాలా మంది మానుకుని ఇతర రంగాలలో స్థిరపడుతున్నారని, అందువల్ల మార్పునకు తగ్గట్టుగా వారికి సహకారం అందించాలని ఆయన కోరారు. మత్స్యశాఖ ద్వారా ఎస్సీలు చేపలు పట్టేందుకు అవకాశం కల్పించాలని, ఉద్యానవన శాఖ ద్వారా ఉద్యాన తోటల పెంపకానికి, డీఆర్డీవో ద్వారా ఉపాధి హామీ పని కల్పించాలని అన్నారు. విద్యాశాఖ ద్వారా నాణ్యమైన విద్య కోసం విద్యాశాఖ అధికారులు పనిచేసే గురుకులాల మాదిరిగా ఫలితాలను తీసుకురావాలని అన్నారు.

జిల్లాలో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని, గురుకుల పాఠశాలలో వసతులు సరిగా లేవని, పట్టణ ప్రాంతాలలో అంబేద్కర్ భవన్‌లను ఏర్పాటు చేయాలని, పెద్దమందడి మండలం గట్టఖానాపూర్‌లో ఇటీవల ఒక ఎస్సీపై దాడి జరిగినప్పటికీ సంబంధితులపై చర్య తీసుకోలేదని అన్నారు. పెబ్బేర్ మండలం పాతపల్లి హుస్సెన్ కుటుంబానికి 5 ఎకరాల భూమిని ఇప్పించాలని జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు కోరారు. అనంతరం కలెక్టర్ శ్వేతామొహంతి ఆయా అంశాలపై చర్చ సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల వారి సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కోళ్ల వెంకటేశ్, నారాయణ, చంద్రశేఖర్, మధుకర్‌లు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములును శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. షెడ్యూల్డ్ కులాల వారి సమస్యలపై జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అలాగే వివిధ దళిత సంఘాల ప్రతినిధులు జాతీయ కమిషన్ సభ్యులు దరఖాస్తులను సమర్పించారు. అనంతరం రాత్రి 8గంటలకు జిల్లా కేంద్రంలోని 4వ వార్డులోని ఇందిరాకాలనీ, 9వ వార్డులోని హరిజన వాడలను ఆయన సందర్శించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయా లేదా వంటి అంశాలను, సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, ఆర్డీవో చంద్రారెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ ఇన్‌చార్జి అధికారి వెంకటస్వామి, ఇన్‌చార్జి అడిషినల్ ఎస్పీ కృష్ణ, డీఎస్పీ కిరణ్‌కుమార్, జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...