ప్రజలకు ఆరోగ్యం.. మత్స్యకారులకు ఉపాధి


Thu,October 17, 2019 03:02 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ప్రజలకు ఆరోగ్యంతో పాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా అధికారులు, మత్స్యకారుల సంఘం సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్‌లో 1.20 లక్షల చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ముందుగా 20 ఏండ్లుగా బీడు బారిన నల్లచెరువు(మినీట్యాంక్‌బండ్)లోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో కృష్ణా జలాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలుగేళ్లుగా మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కాల్వల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకు నీటి నిల్వలు పెంచుతున్నామన్నారు. నల్లచెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా రూపాంతరం చెంది, మొదటి సారి కృష్ణా నీటితో అలుగు పారనున్నదని, నీళ్లు, ఉచిత చేప పిల్లలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 290 చెరువుల్లో కోటి 41 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. ప్రతి ఏటా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచుతూపోతున్నామని, దీనివల్ల మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణ ప్రజలకు బలవర్ధకమైన ఆహారం లభిస్తుందన్నారు. నల్లచెరువు పునర్నిర్మాణంతో వనపర్తి మత్స్యకారులకు పూర్వవైభవం వస్తుందని, మిగిలిన చెరువులను పునురుద్ధరించి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డిని మత్స్యకారులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం సామాజిక వేత్త పోచరవీందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ కౌన్సిలర్లు గట్టుయాదవ్, వాకిటిశ్రీధర్, లక్ష్మీనారాయణ, శ్యాం, రాజు, తిరుమల్, కృష్ణయ్య, నాయకులు చంద్రయ్య, ఎర్రమణ్యం, గిరి, మురళి, నరసింహ, రవి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...