యాసంగికి సై


Tue,October 15, 2019 01:47 AM

-లక్ష్యం.. 1.36 లక్షల ఎకరాలు
-సిద్ధమైన కార్యాచరణ ప్రణాళిక
-పెరగనున్న వేరుశనగ సాగు
-సరిపడా ఎరువులు, విత్తనాల కేటాయింపు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాసంగి సీజన్‌కు వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. వా నాకాలం సాగుబడులు ముగిసిన వేళ.. ఇక యాసంగి పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ శాఖ తగిన చర్యల ను చేపడుతుంది. జిల్లాలోని ఆయా మండలాల వారీ గా రైతుల ఆసక్తి మేరకు కార్యాచరణ రూపొందించా రు. జిల్లా వ్యాప్తంగా లక్షా 36వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. గత యాసంగి కంటే వేరుశగన కొంతమేర పెరగవచ్చన్న అంచనా ఉంది. ఇందుకు కోసం తగిన రీతిలో ఎరువుల అవసరాలను అధికారులు గుర్తించారు. వేరుశనగ, వరి సాగులు భారీగా ఉంటే, పప్పు శనగతోపాటు కూరగాయల సాగులు ప్రాధాన్యతగా ఉన్నాయి. ఈ సాగుబడులకు అనుగుణంగా ఎరువులు.. విత్తనాలను అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

విత్తనాల సరఫరా ఇలా
యాసంగిలో అవసరమైన విత్తనాలను అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. 21,300 క్వింటాళ్ల వేరుశనగ, ఏడు వేల క్వింటాళ్లు పప్పుశనగ, 9వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందులో ఇప్పటికే 12 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు ప్రభు త్వం అందించింది. ఇక వరి, పప్పుశనగ విత్తనాలు కూ డా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే, యాసంగిలో లక్షా36వేల ఎకరాల్లో వివిధ పంటల సాగును చేపడతారని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. వీటిలో వేరుశనగ 59,900 ఎకరాలు, వరి 54,115 ఎకరాలు, పప్పుశనగ 11,700 ఎకరాలు, 10,400 ఎకరాలు కూరగాయలు, ఇతర పంటలసాగు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే దాదాపు 36 వేల ఎకరాల్లో యాసంగి వేరుశనగను సాగు చేశారు. ఇక వరి వచ్చే నెలలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. పప్పుశనగ కూడ మరో పక్షం రోజుల అనంతరం సాగు మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఎరువుల ప్రణాళిక ఇలా
వర్షాలు.. కాలువల ద్వారా సాగునీరు పుష్కలంగా అందుతున్న తరుణంలో పైర్లకు అవసరమైన ఎరువులను కూడా సిద్ధంగా ఉంచుకోవడంలో వ్యవసాయ శాఖ ముందడగు వేస్తున్నది. ఇప్పటికే వానాకాలం పంటల సాగుకు అవసరమైన ఎరువుల నిలువలను సరఫరా చేయించిన జిల్లా అధికారులు యాసంగిలోను ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రణాళికలను ప్రతిపాదించారు. ఈమేరకు యాసంగి పంటల కోసం 8600 టన్నుల యూరియా, 4700 టన్నలు డీఏపీ, 6400 కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఈమేరకు ప్రస్తుతం యూరియా 825 టన్నుల వరకు జిల్లాలో షాపులు, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంది. మిగిలిన ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు రానివ్వకూడదనే లక్ష్యంతో ఎరువుల నిలువలను సిద్ధంగా ఉంచుతున్నారు.

సమృద్ధిగా సాగునీరు
గత ఏడాది వర్షాలు అంతంత మాత్రమే వచ్చాయి. కేవలం కాలువల నీటిపైనే ఎక్కువగా సేద్యం నడిచింది. ఈసారి ఆశించిన స్థాయిలో కొంత ఆలస్యంగా ఇటు వానలు.. అటు కాలువల నీళ్లు సమృద్ధిగా అందుతున్నాయి. ఈ క్రమంలో యాసంగి సాగు గతంలో కంటే మరింత ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలోను జూరాల గేట్లు ఎత్తి కృష్ణమ్మ దిగువకు పరుగులు తీస్తున్నది. అలాగే జిల్లాలోని ఎత్తిపోతల పతకాల ద్వారా సాగునీరు కాలువల్లో గళ.. గళా పారుతుంది. ఇక వర్షం పిలిస్తే పలికినట్లుగా గత పక్షం రోజుల నుంచి జిల్లాలో వస్తూ.. పోతూ ఉంది. జిల్లా పరిధిలోని 14 మండలాల వారీగాను సమృద్ధిగా సాగునీటి పరవళ్లు ఉండటంతో సాగుబడులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఖరీఫ్ పంట చేలన్ని జోరుగా ఉండగా, యాసంగి సాగుబడులను కొలిక్కి తెచ్చుకునే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...