ప్రత్యామ్నాయం సిద్ధం


Sat,October 5, 2019 04:07 AM

-యథావిధిగా బస్సుల రాకపోకలు
-తాత్కాలిక పద్ధతిన 175 మంది డ్రైవర్లు, 210 మంది కండక్టర్లు సిద్ధం
-స్కూల్, హైర్‌బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు
-ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సర్కారు నిర్ణయం

వనపర్తి ప్రతినిధి,నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికులు శనివారం నుంచి సమ్మెకు వెళుతున్న క్రమంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడంపై దృష్టిపెట్టింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రవాణా, పోలీసు శాఖల సమన్వయంతో యథావిధిగా ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లన్ని సిద్ధమయ్యాయి. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో కలుపాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక యూనియన్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు శనివారం నుంచి తాము సమ్మె చేస్తామని ప్రకటించిన సంగతి విధితమే. ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీ వేసి కార్మిక యూనియన్లతో చర్చలు జరిపింది. అయినా ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.

వనపర్తి ఆర్టీసీ డిపో పరిధిలో నడిచే బస్సులను యథావిధిగా నడిపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ డిపో పరిధిలో 85 ఆర్టీసీ బస్సులుంటే, మరో 25 ఆర్టీసీ హైర్ బస్సులు ఉన్నాయి. వీటిని యధాస్థానంలో నడిపించేందుకు తగ్గట్టుగానే ఆర్టీవో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన మరో 180 బస్సుల వరకు ఉన్నాయి. ప్రయాణికుల అవసరాల మేరకు వీటన్నింటిని వినియోగంలోకి తీసుకుని రవాణ సౌకర్యంలో ఇబ్బందులు రానివ్వకూడదనే ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సుల వివరాలతో పాటు వీటికి అవసరమైన డ్రైవర్లు, కండక్టర్ల వ్యవస్థను తాత్కాలికంగా నియమించే పనులను కూడా అధికారులు కొలిక్కి తెచ్చారు.

రవాణా శాఖ జిల్లా అధికారి నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను యథావిధిగా నడిపించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు శుక్రవారం 85 మంది తాత్కాలిక డ్రైవర్లను తీసుకున్నారు. ఏడాదిన్నర అనుభవం ఉన్న హెవ్వి లైసెన్స్‌తో 25 ఏళ్ల వయస్సున్న వారిని తీసుకున్నారు. వీరికి రోజుకు 1500 రూపాయలు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే కండక్టర్లుగాను పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారితో పదో తరగతి మెమో ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారిని తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వంద మందిని కండక్టర్ సర్వీసు కోసం గుర్తించారు. వీరికి వెయ్యి రూపాయాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. కాగా, డ్రైవర్లు, కండక్టర్లుకు తాత్కాలిక బృతికి 12 గంటల పాటు పని చేసే విధంగా నిర్ణయించారు.

పాఠశాల బస్సులు.. ప్రైవేట్ వాహనాలతో..
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదనే లక్ష్యంతో ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులను కూడా రోడ్డు ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 180 ప్రైవేట్ పాఠశాల బస్సులున్నప్పటికీ ప్రస్తుతం 20 బస్సులను ఆయా రూట్లలో తిప్పేందుకు నిర్ణయించారు. రోజుకు వంద రూపాయల చొప్పున ప్రభుత్వానికి టాక్సీ చెల్లించి ఆర్టీసీ చార్టీల ప్రకారం బస్సులను నడిపించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, వీటితో పాటు ప్రైవేట్ వాహనాలను కూడా ఆయా రూట్లలో ప్రయాణికులను చేరవేయాలని కూడా ప్రత్యామ్నాయలను చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే తరహాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...