శ్రీశైల క్షేత్రంలో మార్మోగిన శివనామస్మరణ


Mon,September 9, 2019 02:57 AM

శ్రీశైలం : శ్రీశైల క్షేత్రం భక్తులతో ఆదివారం పురవీధులన్నీ కిటకిటలాడాయి. సెలవు రోజు కావడంతో స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించి నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాడవీధుల గుండా దర్శనానికి క్యూలైన్లలో నిలుచున్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు, బేక్‌ దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. సామూహిక అభిషేకాలతోపాటు స్వామివారికి బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన వృద్ధ మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేశారు. సాయంత్రానికి ఉద్యానవనాలు చిన్నారులుతో కిటకిటలాడాయి. పరిసర ఆలయాలైన శిఖరేశ్వరం, పాలధార పంచధార, హఠకేశ్వరం, సాక్షి గణపతి ఆలయాలు సందడిగా మారాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. సుమారు 10వేల మంది భక్తులు అల్పాహార భోజనాలు చేసి ఉంటారని సిబ్బంది తెలిపారు.
భ్రమరాంబకు పల్లకీ సేవ
శ్రీశైలంలో సాయంత్రం భ్రమరాంబాదేవికి పల్లకీ సేవ నిర్వహించారు. అమ్మవారి ప్రాకార మండపంలో వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకీలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసిన వేదపండితులు అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం గర్భాలయం చుట్టు మూడు ప్రదక్షిణలు చేశారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజు పల్లకీ సేవను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శివతత్వ ప్రవచనం
దక్షణ మాడవీధి హరిహరరాయ గోపురం వద్ద నిర్వహించిన ప్రవచనం అందరినీ అలరించింది. కడప జిల్లా రాయచోటికి చెందిన కే ప్రమీళ శివతత్వ ప్రవచనం చేశారు. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని దేవస్ధానం అధికారులు అంటున్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...