ప్రజెంట్ సక్సెస్


Wed,September 4, 2019 02:47 AM

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హాజరు మాసోత్సవంలో ప్రధానంగా క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చే విద్యార్థులను గుర్తించి వారికి ప్రోత్సాహకాలను అందించారు. ముందు నుంచి బడికి సక్రమంగా రాని విద్యార్థులపైన దృష్టి పెట్టిన అధ్యాపక బృందం తమదైన శైలిలో సైకిళ్లు, పెన్నులు, పుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర వాటిని అందించేలా ప్రోత్సాహించడంతో హాజరు మాసోత్సవం సర్కార్ బడులకు ఉపయోగకరంగా నిలుస్తుంది. మెజార్టీ పాఠశాలల్లో ఈ కార్యక్రమం అనంతరం హాజరులో మెరుగైన విద్యార్థులందరికీ ప్రోత్సాహకాలు అందించారు. రోజు వారి ప్రార్థన సమయాల్లోను హాజరుమాసోత్సవ ప్రాధాన్యతను వివరించడం వల్ల పరిస్థితుల్లో మార్పులకు దోహదపడ్డాయి. ప్రోత్సాహకం చిన్నదైనా.. మార్పు పెద్ద ప్రభావాన్ని చూపించే దిశగా హాజరుమాసోత్సవం కొనసాగింది.

552 ప్రభుత్వ పాఠశాలలుంటే..
జిల్లాలో 14 మండలాలు, ఐదు మున్సిపాల్టీల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 552 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 361, ప్రాథమికోన్నత పాఠశాలలు 60, ఉన్నత పాఠశాలలు 40 వరకు ఉన్నాయి. వీటిలో కస్తూర్భా, ఆదర్శ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలన్నీ కలుపుకుని ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా 2019-20 విద్యా సంవత్సరంలో నిర్వహించిన బడిబాట విజయవంతమైంది. అత్యధిక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వారంతా పాఠశాలలకు క్రమంగా వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవడంలాంటివి హాజరుమాసోత్సవ కార్యక్రమాలకు వేదికగా నిలిచాయి. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ పరంగా ఉన్న అన్ని రకాల పాఠశాలల్లో 55,452 మంది విద్యార్థులు విద్యభ్యాసం చేస్తున్నారు.

ప్రత్యేక యాప్‌తో అనుసంధానం
జిల్లాలో ఆగస్టు నెలలో నిర్వహించిన హాజరు మాసోత్సవంలో రోజు వారి వివరాల కోసం విద్యాశాఖ ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసింది. ఈ యాప్ ద్వారానే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును లెక్కలోకి తీసుకున్నారు. హాజరుమాసోత్సవంలో దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ అనుసరించింది. గత జూలై నెలలో విద్యార్థుల హాజరు శాతం 75 శాతం ఉంటే, ఆగస్టులో 79 శాతం నమోదైనట్లుగా అధికారులు చెప్పారు. అలాగే ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగుపడటంతో సర్కార్ బడులకు ఊరటనిస్తుంది. విద్యార్థుల మొత్తం సంఖ్యలో సుమారు ఐదు నుంచి ఏడు వేల మంది విద్యార్థులు నిత్యం గైర్హాజరు అయ్యే పరిస్థితులుండేవి. మారుమూల గ్రామాల్లో తల్లిదండ్రులు ఎక్కువగా వలసలకు వెళుతుండటంతో వారి వెంటే పిల్లలు కూడా వెళ్లడంతో కొందరు గైర్హాజరు అవుతున్నారు. గ్రామాల్లో ఉండి కూడా వివిధ పనులకు తీసుకెళ్లడం ద్వారా మరికొందరు విద్యార్థులు గైర్హాజరు అవుతున్నట్లు గతంలోనే గుర్తించారు. ఈ రెండు అంశాలపై విద్యాశాఖ దృష్టి పెట్టడం వల్ల కొంతమేర మార్పులు చోటు చేసుకున్నాయి.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...