అవస్థలకు చెక్


Sat,August 24, 2019 02:00 AM

-వనపర్తిలో మోడల్ వ్యవసాయ మార్కెట్
-శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి
-43 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
-రూ.35 కోట్లతో నిర్మాణ పనులకు శ్రీకారం
-రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు
-వచ్చే నెలలో టెండర్లకు ఆహ్వానం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలో రైతులకు సరిపడా వ్యవసాయ మార్కెట్ యార్డు లేదు. గతంలో ఉన్న మార్కెట్ యార్డు కుదించుకుపోవడంతో ప్రతి ఏటా రైతులకు క్రయ విక్రయాల్లో అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. రెండు సీజన్ల వారీగా రైతులు భారీగా ధాన్యంతో మార్కెట్‌కు వస్తున్నారు. కొత్త బస్టాండ్‌కు సమీపంలో ఉన్న ఈ మార్కెట్ యార్డు చాలా చిన్నగా మారింది. గతంలో కొంత అటు ఇటుగా సరిపోయినా.. ఈ నాలుగేళ్లుగా రైతుల ధాన్యం విక్రయాలకు ఏ మాత్రం సరిపోవడంలేదు. ప్రస్తుత మార్కెట్ యార్డు దాదాపు 9 ఎకరాల స్థలంలో ఉందని అధికారులు చెబుతున్నా.. క్రయ విక్రయాలకు మాత్రం నాలుగు ఎకరాలకు మించి లేదనే అభిప్రాయం ఉన్నది. మిగిలిన స్థలాల్లో భవనాలు, మరికొంత ఖాళీ స్థలం ఉండగా, ఇక తక్కువ స్థలంలోనే రైతులు ధాన్యం విక్రయించుకునే పరిస్థితి ఉన్నందునా ఇబ్బందులు పడక తప్పడం లేదు.

సాగునీటి వసతి లేనప్పుడు ఈ మార్కెట్ యార్డు అంతంత మాత్రంగా రైతులకు ఉపయోగపడింది. ప్రత్యేక రాష్ట్రంలో సాగుబడులకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందించడంతో పంటరాసులు వనపర్తికి మార్కెట్‌కు తరలివస్తున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కువ వేరుశనగ పంటను పండించే జిల్లాగా వనపర్తి చరిత్ర కెక్కింది. దీంతో దాదాపు మూడు నెలల పాటు రైతులకు ఇక్కడ ధాన్యం విక్రయాలు చేయాలంటే నరకయాతనే ఎదురవుతుంది. ఇక్కడ ఖాళీ స్థలం ఉందా.. లేదా తెలుసుకుని రైతులు మార్కెట్‌కు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఈ ఐదేళ్లుగా విక్రయాలకు అవస్థలు పడుతున్న రైతులను చూసి కొత్త మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదించడం.. ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేయడంతో ఇక మార్కెట్‌లో విక్రయాలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

43 ఎకరాల్లో ఏర్పాటు..
వనపర్తి మండలంలోని చిట్యాల తూర్పుతండా శివారులో ఉన్న బీసీ గురుకుల పాఠశాల సమీపంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 43.38 ఎకరాల విస్తీర్ణంలో కొత్త మార్కెట్ యార్డును నిర్మించనున్నారు. వనపర్తి-ఖిల్లాఘణపురం రోడ్డును అనుసరించి ఉన్న అసైన్డ్ భూమిలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కానున్నది. సువిశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఈ మార్కెట్ వల్ల రైతులకు మెరుగైన సౌకర్యం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే, ఇదే ప్రాంగణంలో ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌కు అనుగుణంగా రెండు గోదాంలను నిర్మించారు. ఒక్కొక్క గోదాంను ఐదు వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.

రూ.35 కోట్లతో పనులు..
నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.35 కోట్లను తొలి విడతలో ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం నూతన మార్కెట్ యార్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం టెక్నికల్ మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సాంకేతిక అనుమతి వచ్చిన అనంతరం టెండరు పనులను చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా పది రోజుల్లో జరిగే విధంగా చూడాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించడంతో కార్యాచరణ వేగంగా జరుగుతున్నది. నిధుల మంజూరులోనూ మంత్రి చొరవ తీసుకోవడంతో పనులను వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ముందుగా ఈ నిధుల ద్వారా మార్కెట్ కార్యాలయం, సీసీ రోడ్లు, నీటి వసతి, ప్లాట్‌ఫామ్స్ తదితర వాటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...