సాగునీటి కోసం తండ్లాట


Wed,August 21, 2019 03:06 AM

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భీమా ఫేజ్-2లో శంకరసముద్రం నుంచి 27వ ప్యాకేజీ కాలువను దాదాపు 64 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేశారు. దీని కింద 57 గ్రామాలు, 49 వేల ఆయకట్టుకు సాగునీరందుతుంది. అయితే, కొన్ని రోజులుగా ఈ కాలువకు నీటి విడుదల జరుగుతున్నా కొన్ని గ్రామాలకు మాత్రమే నీరు సరిపడా అందాలి. ఇదిలా ఉండగా, 27 ప్యాకేజీలో అంతర్భాగమైన డిస్ట్రిబ్యూటరీ-23 కాలువను బుసిరెడ్డిపల్లి శివారులోని బొల్లిగట్టు సమీపంలో ఏర్పాటు చేశారు. దాదాపు 15 కిలోమీటర్ల పొడవున ఉన్నది. ఈ కాలువపై 12 గ్రామాలు ఆధారపడగా, 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాలి. ఇక్కడి నుంచి కాలువను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల నీరు రావడం లేదు. కాలువల్లో తీసిన మట్టిని సైతం మళ్లీ కిందకు పడేలా వేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా కల్వరాల శివారులో అనేక చోట్ల డీ-23 కాలువ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మధ్యలో బ్లాస్టింగ్ చేసి రాళ్లను, మట్టిని తీయకుండా కాంట్రాక్టర్లు అలాగే వదలేశారు. మరికొన్ని చోట్ల బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నా చేయలేదు. వీటివల్ల కల్వరాల, వీపనగండ్ల, సంగినేనిపల్లి, తూంకుంట గ్రామాలకు సాగునీరు చేరుకోవడం లేదు. ఈ పనులు సవ్యంగా జరిగితే ఈ గ్రామాలకు భీమా నీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. స్థానికంగా వర్షాల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న క్రమంలో ఎత్తిపోతల పథకాలపైనే రైతులు ఆధారపడ్డారు. దీంతో కాలువల ద్వారా సాగునీరు ఎప్పుడొస్తుందా అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.

45వ కిలోమీటరు వరకు చేరిన నీళ్లు..
జూలై 31వ తేదీ నుంచి మదనాపురం మండలం తిరుమలాయిపల్లిలో ఉన్న భీమా-2లోని మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఇక్కడి నుండి కొత్తకోట సమీపంలోని స్టేజీ-2 ద్వారా శంకసముద్రంలోని అడ్డకట్ట మలుపుతో 27 ప్యాకేజీకి సాగునీరు వెళుతుంది. క్రమంగా మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్నప్పటికీ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేతేపల్లికి మాత్రమే 27వ ప్యాకేజీలో కొద్ది నీరు అందుతుంది. ఇంకాను 27వ ప్యాకేజీలో తెల్లరాళ్లపల్లి, తెల్లరాళ్లపల్లి తండా, కొర్లకుంట, బొల్లారం వరకు సాగునీరందాలి. మరికొన్ని గ్రామాలకు కూడా ఈ ప్యాకేజీ ద్వారానే నీరందించాల్సి ఉండగా పనులు పూర్తి కాలేదు.

ఇదిలా ఉంటే, డీ-23 కాలువ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. బుసిరెడ్డిపల్లికి నీరు అంది రెండు, మూడు చెరువులు నిండాయి. కానీ, దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్వరాల శివారుకు మాత్రమే నీరు చేరుకున్నాయి. వీపనగండ్ల, సంగినేనిపల్లి, తూంకుంట రైతులు భీమా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. డీ-23 కాలువ పనులు సహితం చివరి వరకు పూర్తి చేయలేదు.

కాల్వల వెంట రైతులు..
అధికారులు, కాంట్రాక్టర్లను సాగునీరివ్వాలని అనేక పర్యాయాలు అడిగి వేసారిన రైతులు కాలువల వెంట పరుగెడుతున్నారు. ముందు గ్రామాలకు ఎందుకు నీరు రావడం లేదో తెలుసుకుని స్వంతంగానే పనులు చేసుకుంటున్నారు. కాలువలపై బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం కొన్ని పైపులు మాత్రమే వేయడం ద్వారా సాగునీరు అధిక శాతం ముందుకు రావడం లేదు. ఇది గమనించిన రైతులు కల్వరాల రైతులు తాటిపాముల శివారులో రెండు చోట్ల స్వంతంగా రెండు సిమెంట్ పైపులను అదనంగా వేసే పనులు చేపట్టారు. వీటివల్లనైనా డీ-23లోని ముందు గ్రామాలకు సాగునీరు అందుతుందని ఇక్కడి రైతులు ఆశిస్తున్నారు.

నీళ్లు కావాలని ఒత్తిడి..
మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్నా తమకు సాగునీరందడం లేదంటూ ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. మంత్రి స్థాయి నుంచి సర్పంచ్‌కు.. కలెక్టర్ నుంచి ఏఈ వరకు సాగునీటి కోసం రైతులు ఆరాటపడుతున్నారు. స్వయంగా రైతులే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్లు చేసి నీటిని విడుదల చేయించాలని కోరుతుండంతో అధికారులను అప్పటికప్పుడే పురమాయిస్తున్నారు. ఇక అధికారులు ఎక్కడికి వెళ్లినా సాగునీటి గురించి వాకబు చేస్తున్నారు. తమకు నీరు రావడం లేదని అధికారుల ముందు రైతులు లబోదిబోమంటున్నారు. ఇటీవల వీపనగండ్ల మండల కేంద్రానికి కలెక్టర్ శ్వేతామొహంతి చేరుకున్నప్పుడు అక్కడి ఎంపీపీ, కల్వరాల సర్పంచ్‌లు సాగునీటిపై ఏకరువు పెట్టారు. అక్కడి నుంచే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ రెండు రోజుల్లో మీ గ్రామాలకు నీరు వస్తుందని చెప్పారు. అయినా సాగునీరు మాత్రం ముందు గ్రామాలకు రాలేదు. కింది స్థాయిలో ఉండే డీఈ, ఏఈల పైన రైతుల ఒత్తిడి భారీగా పెరిగింది. కొన్ని చోట్ల రైతులు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు తారసపడుతున్నాయి. ఈ క్రమంలో కాలువల్లో అక్కడక్కడ అత్యవసరమైన పనులను చేపట్టి ఆయకట్టు గ్రామాలకు సాగునీందించాల్సిన అవసరం ఉంది.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...