పవర్‌ఫుల్ కృష్ణమ్మ


Sun,August 18, 2019 02:16 AM

-జూరాల, శ్రీశైలంలో 292 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి
-10 రోజుల్లోనే గణనీయంగా పెరిగిన వైనం
-వరద ఉధృతితో జూరాలలో తాత్కాలికంగా నిలిపివేత
-మరో రెండు రోజుల్లో తిరిగి ప్రారంభించే అవకాశం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాల పరిధిలోని రెండు కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా కొనసాగింది. కృష్ణానది బేసిన్‌లో ఎగువన కర్నాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలకు వరదులు పొటెత్తాయి. స్థానికంగా వర్షాలు నామమాత్రంగా ఉన్న క్రమంలో నదిలో వరదల వచ్చిన ఫలితంగా ఇటు వ్యవసాయానికి.. అటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లభించింది. గత నెల 30వ తేదీ నుంచి జూరాలకు వర ద ప్రారంభమైంది. అతి తక్కువతో మొదలైన వరద అత్యధిక స్థాయిలో వరదలు పారడం ప్రత్యేకంగా నిలిచింది. దశాబ్దకాలంలో ఇంతటి వరదల ప్రవాహం ఇక్కడి ప్రజలు చూడలేదు. ఏకభిగిన కొనసాగిన వరదలతో నదీతీర ప్రాంతం పరవశించి పోయింది.

40 మిలియన్ యూనిట్లు
దాదాపు పది రోజుల వ్యవధిలో ఎగువ జూరాల, దిగువ జూరాల కేంద్రాల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. జూలై 30 నుంచి ప్రారంభమైన ఉత్పత్తి ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగింది. ఈ సమయంలో మొత్తం 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆగస్టు 9 నుంచి వరదల భారీగా రావడంతో ఈ రెండు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపి వేశారు. మళ్లి వరదలు తగ్గుముఖం పడితే తప్పా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యం కాదు. ఎగువ జూరాల కేంద్రంలో 6 యూనిట్లుంటే, 39 మేగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే దిగువ జూరాలలోను 6 యూనిట్లుండగా 40 మేగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సముద్రమట్టానికి 299 మీటర్ల కంటే మించి వరద ప్రవాహం ఉన్నప్పుడు జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుపడనందునా ఈ రెండు కేంద్రాల్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపి వేయక తప్పలేదు.

కృష్ణా బేసిన్‌లో..
కృష్ణా బేసిన్‌లో ఒకేసారి వరదలు రావడంతో జల విద్యుత్ ఉత్పత్తికి సువర్ణావకాశం లభించినట్లు హైడల్ ప్రాజెక్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా బేసిన్‌లో వరుసగా పదేళ్ల వరదలను పరిశీలిస్తే.. ఇంత లా జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం రాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలంగాణలోనే దాదాపు ఐదు జల విద్యుత్ కేంద్రాల్లో ఒకేసారి కృష్ణా పరిధిలో జల విద్యుత్ ఉత్పత్తి కావడం అరుదుగా కనిపిస్తుంది. జూరాల పరిధిలోని రెండు కేంద్రాలతోపాటు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల ఆధారంగా జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తెలంగాణకు కృష్ణా బేసిన్‌లో ఉన్నాయి. నేడు ఇవన్ని కూడా జల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుండటం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల మినహా మిగిలిన ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

మరో రెండు రోజుల్లో..
జూరాలలోను వరద తగ్గుముఖం పడితే ఇక్కడి రెండు కేంద్రాల్లోను విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శనివారం జూరాల నుంచి దిగువకు 5,33,708 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వెళుతుంది. జూలై 30 నుంచి జూరాలకు వరద ప్రారంభమైతే, రోజు.. రోజుకు పెరిగి 8.68 లక్షల క్యూసెక్కుల వరకు నీటి విడుదల దిగువకు కొనసాగింది. దాదాపు జూరాల ప్రాజెక్టులో ఉన్న 62 గేట్లు ఎత్తి నీటిని వదలడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం. అయితే, జూరాల పరిధిలో రెండు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభం కావాలంటే, వరద మరింత తగ్గుముఖం పట్టాల్సి ఉంది. రెండు నుంచి మూడు లక్ష్యల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే తప్పా ఇక్కడి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వచ్చే రెండు రోజుల్లో ఎగువన వర్షాలు లేనందునా ఇక్కడ వరద తగ్గుముఖం పట్టి విద్యుత్ ఉత్పత్తికి అవకాశం వస్తుందని హైడల్ ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 9 రోజుల నుంచి వరద ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిన సంగతి విధితమే.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...