20 లక్షల ఎకరాలకు సాగునీరే లక్ష్యం


Thu,August 15, 2019 03:13 AM

-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
-20 లక్షల ఎకరాలకు సాగునీరే లక్ష్యం
-గుడిపల్లి రిజర్వాయర్‌లోకి నీటి విడుదల

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని ఎంజీకేఎల్‌ఐ మూడో రిజర్వాయర్‌లో మొదటి మోటార్ ద్వారా మంత్రి నిరంజన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పాలమూరును సస్యశ్యామలం చేయడం సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందులో భాగంగా జిల్లాలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల నీటిని పూర్తి చేస్తూ వస్తున్నామన్నారు. గత సమైక్య రాష్ట్రంలో పాలకుల విధానాల వల్ల కృష్ణానది నీళ్లు వృథాగా వెళ్లాయని, దీని కోసం సీఎం కేసీఆర్ గత ఐదేళ్ల నుంచి జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయించారన్నారు. దీని వల్ల జిల్లాలోని బీడు భూములు పచ్చగా బంగారు పంటలు పండిస్తున్నాయని తెలిపారు. ఎంజీకేఎల్‌ఐ ద్వారా 4లక్షల ఎకరాలకు సాగునీరందించే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

గతేడాది దాదాపు 3లక్షల ఎకరాలకు ఎంజీకేఎల్‌ఐ ద్వారా సాగునీరు అందజేశామన్నారు. ఎంజీకేఎల్‌ఐ రిజర్వాయర్‌లో భాగంగా అదనపు నీటి నిల్వను కల్పించేందుకు కొత్తగా 40 రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ సర్వే దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే అదనపు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి గురువారం రెండవ పంప్ ద్వారా నీటి విడుదల చేపట్టడం జరుగుతుందన్నారు. ఉమ్మడి పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ త్వరలో సమీక్షిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, ఈఈ రమేశ్‌జాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ భీమయ్య, ఎంపీపీ బంకళసేనాపతి, వైస్ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రేవల్లి మండలఅధ్యక్షుడు నారాయణ రెడ్డి, సర్పంచులు ఉన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...