21న సీఎం కేసీఆర్ రాక


Wed,August 14, 2019 02:32 AM

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఈ నెల 21 పాలమూరు పర్యటనకు రానున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు ఆయన హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి వస్తారని సమాచారం. మొదట కొల్లాపూర్ సమీపంలో సోమశిల, అమరగిరి, కోతిగుండు ప్రాంతాల్లో కృష్ణానది వెంట ఆయన ఏరియల్ సర్వే చేస్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని తీసుకునే కోతిగుండు ప్రాంతం నుంచి లిఫ్ట్-1, నార్లాపూర్ రిజర్వాయర్, కొత్తపేట సమీపంలో టన్నెల్ పనులను హెలీక్యాప్టర్ నుంచే పరిశీలించనున్నారు. తర్వాత ఎంజీకేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు, సింగోటం రిజర్వాయర్లను సైతం పరిశీలిస్తారు. ఆ తర్వాత నేరుగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా దాదాపు పనులు పూర్తి కావచ్చిన ఏదుల రిజర్వాయర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్ పరిశీలన అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తూ హైదరాబాద్ చేరుకుంటారు. సీఎంతో పాటు జిల్లా మంత్రులు, ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు ఏరియల్ సర్వే, సమీక్షలో పాల్గొననున్నారని సమాచారం.

పాలమూరు వేగవంతానికే సీఎం పర్యటన
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తి చేసేందుకే సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం పనులు పూర్తయిన నేపథ్యంలో సీఎం పాలమూరుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందుకే స్వయంగా వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించి రివ్యూ చేసేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టు పనుల వేగవంతానికి తీసుకునాల్సిన అన్ని నిర్ణయాలను సీఎం ఈ పర్యటనలో పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనపై తమకు సమాచారం ఉందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...