అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం


Wed,August 14, 2019 02:27 AM

గద్వాల, నమస్తే తెలంగాణ: గద్వాల మండలంలోని దివి గ్రామమైన గుర్రంగడ్డ ప్రజలకు అండగా మేమున్నామని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక గ్రామస్తులకు భరోసానిచ్చారు. మూడు రోజులుగా గ్రామం చుట్టూ కృష్ణానది నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న గ్రామాన్ని కలెక్టర్ అన్నిశాఖల జిల్లా అధికారులతో కలిసి బోటుద్వారా నదిని దాటి, మరికొంత దూరం ట్రాక్టర్‌పై మంగళవారం ప్రయాణం చేసి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా లైన్‌లో ఒక టవర్ వరద ఉధృతికి కూలిపోవడంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచి పోయిందని గ్రామస్తులు తెలిపారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సింగల్ ఫేజ్ కనెక్షన్ వచ్చేవిధంగా లైన్ డ్రా చేసి విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ డీఈని ఆదేశించారు. వరద తగ్గగానే మూడు ఫేజ్‌ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు విద్యుత్ టవర్ ఎత్తు పెంచేందుకు, విద్యుత్‌ను కేబుల్ ద్వారా సరఫరా చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వరినారు ఎండిపోతుందని త్వరగా విద్యుత్ సరఫరా చేయించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి 10 లీటర్ల కిరోసిన్, 20కిలోల బియ్యం సరఫరా చేయాలని గద్వాల తాసిల్దార్ జ్యోతిని కలెక్టర్ ఆదేశించారు. నీట మునిగిన పొలాలను పరిశీలించిన కలెక్టర్ వెంటనే అంచనా వేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌ను ఆదేశించారు. రైతులు వరి ఒక్కటే కాకుండా పండ్ల తోటలు పెంచనికి అవగాహన కల్పించాలని ఉద్యానవన శాఖ అధికారి జయరాజ్‌ను ఆదేశించారు. డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందుగానే పారిశుద్ధ్య పనులు చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతో పాటు ఫాగింగ్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకు సూచించారు. బుధవారం హెల్త్‌క్యాంపు ఏర్పాటుచేసి అన్ని రకాల మందులు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం జాతీయ విపత్తు సహాయ బృందాలతో పాటు పదో బెటాలియన్ కమాండెంట్ రాహుల్ దీక్షిత్‌తో మాట్లాడారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష, విద్యుత్‌శాఖ డీఈ మోహన్, గ్రామస్తులు భాస్కర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...