కొనసాగుతున్న సహాయక చర్యలు


Wed,August 14, 2019 02:26 AM

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ /మాగనూరు/కృష్ణ : పది రోజులుగా అతలాకుతలం చేసిన కృష్ణమ్మ జోరు మంగళవారం నాటికి కొంత మేర తగ్గింది. కర్నాటకలో ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలు కురువకుంటే వరద మరింతగా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి. వరద తీవ్రత కొంత తగ్గినప్పటికిని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సహాయక కార్యక్రమాలను అధికారులు యధావిధిగా కొనసాగిస్తున్నారు. నదీతీర ప్రాంతంలో వరదలో మునిగిపోయిన వరి చేలు కొంతమేర తేలాయి. కున్షి గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితులకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా మౌలిక, భోజన సదుపాయాలను కల్పించారు. సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన సలహా మేరకు అధికారులు పునరావాస కేంద్రం లో వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, బొడ్డెమ్మ ఆటలతో ఆనందాలను పంచుకున్నారు. మంగళవారం రాత్రి ప్రత్యేకంగా ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేసి చలన చిత్రాలను ప్రదర్శంచారు.

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పర్యటన
వరద తాకిడికి గురైన మాగనూర్ మండలంలోని మందిపల్లి, కొల్పూరు, పుంజనూర్‌లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సంఘం సభ్యురాలు సుచరితారెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు శ్రీనివాసులు గుప్త, మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగ ఎమ్మెల్యే వరద సహాయక కార్యక్రమాలపై అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన పూర్తిగా నీట మునిగిన వాసునగర్ గ్రామాన్ని మరోమారు పరిశీలించి కృష్ణానది నుంచి ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలను ఎమ్మెల్యే చిట్టెం పరిశీలించారు.

ముంపు గ్రామాల్లో పర్యటించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు
వరద తాకిడికి గురైన గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిళ్లడంతో ఆ శాఖ సీజీఎం పాండునాయక్, ఎస్‌ఈజీ భిక్షపతి, డీఈ చంద్రమౌళి మంగళవారం మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగిన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర నష్టాలను అంచనా వేశారు. వరద తీవ్రత తగ్గిన వెంటనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందకు తగిన చర్యలు తీసుకునే విధంగా అధికారులు నిర్ణయించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...