ఉత్తుంగభద్ర ఉప్పెనలా కృష్ణమ్మ


Tue,August 13, 2019 01:46 AM

-ప్రతాపం చూపుతున్న భీమా
-మూడు నదుల ముప్పేట దాడి
-జలాగ్రహానికి గ్రామాలు విలవిల
-వరదపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సీఎం ఆరా..
-ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె, ఎమ్మెల్యేలు
-సహాయక చర్యల్లో అధికారులు
-పునరావాసం, వైద్యసేవల్లో యంత్రాంగం
-దశాబ్దం తర్వాత భారీ వరద

నారాయణపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి:కృష్ణమ్మ కన్నెర్ర చేసింది.. తుంగభద్ర ఉత్తుంగతరంగంలా దూసుకొస్తున్నది.. భీమా ప్రతాపం చూపుతున్నది. మూడు నదుల ముప్పేటదాడితో ఉమ్మడి పాలమూరు విలవిలలాడుతున్నది. దశాబ్దం తర్వాత మూడు నదులకు భారీ వరద వస్తున్నది. నదుల ఆగ్రహానికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నారాయణపేట జిల్లాలో నాలుగు, జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు గ్రామాల్లోకి నీరు వచ్చాయి. దీంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించి, వైద్య సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా వరద తీవ్రతపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి నారాయణపేట జిల్లా హిందూపురంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. కృష్ణానది లంక గ్రామమైన గుర్రం గడ్డను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సందర్శించారు.

దేశవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి.. మనకు జలాలు వచ్చి చేరుతున్నాయని సంతోషించాం.. కానీ అనూహ్య రీతిలో వచ్చిన వరదల వల్ల కొంత నష్టం జరిగింది.. వరద ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో ముంపునకు గురైన హిందూపూర్ గ్రామస్తులకు కున్సిలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో ఆయన బాధితులతో మాట్లాడారు. వరదలు వచ్చినప్పటి నుంచి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ డాక్టర్ చేతన ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వరద ముప్పు ఉన్న గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారన్నారు.

దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలను పూర్తిగా నివారించగలిగాం కానీ వరదనీరు గ్రామాల్లోకి రావడం ప్రకృతి వైపరీత్యం.. దాన్ని అంత సులభంగా నివారించలేమన్నారు. ఇప్పటికే వాసునగర్, మారుతినగర్ పూర్తిగా వరదనీటిలో మునిగిపోగా, హిందూపూర్‌లోని పలు కాలనీలు నీటిలో మునిగాయన్నారు. ఈ పరిస్థితులు పునరావృత్తం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 15రోజుల్లో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను కేజీబీవీ సమీపంలోని మూడెకరాల ప్రభుత్వస్థలంలో నిర్మించే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. వరద తీవ్రతను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం తమదని బాధితులకు భరోసా కల్పించారు. మెరుగైన వైద్యసేవలు, ఆహార సదుపాయాలను కల్పించాలని, వినోదం కోసం పునరావాస కేంద్రంలో ప్రొజెక్టర్ వసతిని కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను రాజకీయాలు చేయొద్దని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి హితవు పలికారు..

రాత్రింబవళ్లూ పనిచేస్తాం..
ప్రజలకు అన్ని విధాలుగా ఉండి ఆదుకుంటామని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాత్రింబవళ్లూ శ్రమించి సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు.

రాజకీయాలు చేస్తే సహించేది లేదు
ప్రకృతి వైపరీత్యాలకు ఏర్పడిన సమస్యలను స్వలాభం కోసం రాజకీయం చేయాలని చూస్తే సహించేది లేదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. కొంతమంది ఏం చేశారని జరుగుతున్న అభివృద్ధిని, వరద బాధితుల కోసం తీసుకుంటున్న చర్యలను తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. హిందూపూర్ గ్రామస్తులకు ముంపు ప్రమాదం లేకుండా డబుల్ బెడ్‌రూం ఇళ్లను తన కోటా ద్వారా నిర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో దాదాపుగా 5వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, ప్రభుత్వ పరంగా బాధిత రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు.

భరోసా కల్పించిన మంత్రి పర్యటన..
వరద బాధితులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి పర్యటన పూర్తి భరోసానిచ్చింది. సీఎం ఆదేశాలతో హుటాహుటిన ముంపు గ్రామాల్లో పర్యటన కోసం వచ్చిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ డాక్టర్ చేతన సోమవారం ఉదయం కృష్ణ మండలం హిందూపూర్‌లో స్వాగతం పలికారు. ముంపునకు గురైన హిందూపూర్‌లో పర్యటించి వరద తీవ్రతను పరిశీలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి బోటులో వరదనీటిలో పయనించి తీవ్రతను అంచనా వేశారు. అనంతరం వారు తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన టైరోడ్డు వద్దకు చేరుకుని, వరదనీటి ప్రవాహంతో ప్రమాదస్థాయికి చేరిన ఎన్‌హెచ్-167ను పరిశీలించారు. రోడ్డును మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం పస్పుల వద్ద దత్తపీఠాన్ని సందర్శించి వరద తీవ్రతను పరిశీలించారు. కార్యక్రమంలో టీఎస్ టీపీసీ చైర్మన్ దేవరి మల్లప్ప, జెడ్పీ చైర్‌పర్సన్ కే వనజమ్మ, మార్కెట్ చైర్మన్ పీ నర్సింహాగౌడ్, జెడ్పీ సీఈఓ కాళిందిని, ఆర్డీవో శ్రీనివాసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...