వరద భీభత్సం


Mon,August 12, 2019 12:56 AM

-ఆలయాల్లోకి చేరిన వరదనీరు
-అప్రమత్తమైన అధికారులు, ప్రజలు
-లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఖాళీ చేస్త్తున్న వైనం
-ఎప్పటికపుడు సమాచారం అందజేస్తున్న అధికారులు
-వరద నీటిలో చిక్కుకున్న 45మంది క్షేమం

అలంపూర్, నమస్తే తెలంగాణ : ఎగువ ప్రాంతంలో కురిసిన అధిక వర్షాలకు నడిగడ్డ జిల్లాలో ఓ వైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర రెండు వైపులా రెండు నదులు నిండుకుండలా ప్రవహిస్తుంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఓ వైపు అధికార యంత్రాంగం మరోవైపు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గంట గంటకు నదీ ప్రవాహంలో వేగం పెరుగుతుంది. నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలంలో కృష్ణానది యాక్తాపురం, బీచుపల్లి, గార్లపాడు, ఉండవల్లి మండలం మారుమునగాల, ప్రాగటూరు, శేరుపల్లె, పుల్లూరు, మెన్నిపాడు, కలుగోట్ల, రాజోలి మండలం పడమటి గార్లపాడు, పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూరు, తుమ్మిళ్ళ, రాజోలి, అయిజ మండలం కుట్కనూరు, రాజాపురం, వేణిసోంపురం, మానవపాడు మండలం మద్దూరు, కొర్విపాడు, అలంపూర్ మండలం క్యాతూరు, భీమవరం, గుందిమల్ల, భైరంపల్లి, సింగవరం, సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు తదితర గ్రామాల్లో అధికారులు మొదటి హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అలంపూర్ ఆలయాల సమీపంలో ప్రహరీ వద్ద నదిలో నీటి మట్టం 885 అడుగులకు చేరింది. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, ఆర్డీవో రాములు, పోలీస్, రెవెన్యూ అధికారులు ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించి పరిస్థితులను అంచనాలు వేస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మరికొంత మంది ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు ముందు జాగ్రత్తతో నివాసాలు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

నీట మునిగిన పంట పొలాలు
ఇటిక్యాల: మండలంలోని కొండపేటలో నదీతీరం వెంబడి 150 ఎకరాల వరిపంట, సుమారు 50ఎకరాల బెండ తోటలు పూర్తిగా నీట మునిగిపోగా దువాసిపల్లెలో 40 ఎకరాల పంట, ఆర్ గార్లపాడ్‌లో 25 ఎకరాల పంటపొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. అదేవిధంగా బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామాలయం నీటిమునిగింది. సోమవారం మరింతగా వచ్చే వరదనీటితో మరిన్ని పంట పొలాలు నీట మునిగిపోనున్నాయి.

వరదనీటిలో చిక్కుకున్న 45మంది క్షేమం
పెబ్బేరు రూరల్: మండలంలోని రాంపురం వద్ద ఆదివారం వరద నీటిలో సుమారు 45 మంది చిక్కుకపోయారు. అక్కడ చేపల చెరువుల్లో పనిచేసే వీర్రాజు, కొండల్ అనే వ్యక్తులు చూస్తుండగానే చెరువుల చుట్టూ నీరు రావడంతో ఏమి తోచని స్థితిలో ఉండిపోయారు. బయటికి రాలేక రక్షించాలని కేకలు వేశారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ విజయకుమార్ అక్కడకు చేరుకొని గుర్రంగడ్డ దీవి నుంచి మరబోటు తెప్పించారు. దాంట్లో ఆయనతోపాటు సర్పంచ్ బస్వరాజు, గ్రామస్తులు నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకి చెందినవారు. అదేవిధంగా చేపల చెరువుల్లోనే చిక్కుకున్న మరో 43 మందిని సైతం రక్షించారు. సుమారు పది కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు, పెంపుడు జంతువులు బయటపడిన వారిలో ఉన్నారు. సర్పంచ్ బస్వరాజు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గోపాల్, ఎంకే మూర్తి, మాసన్న, వేణురెడ్డి, సాయి, గురువారెడ్డి తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...