ఠాణా రూపు మారింది!


Mon,July 22, 2019 01:38 AM

మహబూబ్‌నగర్ క్రైం : జిల్లాలో ఫ్రెం డ్లీ పోలీసింగ్, పోలీస్ వ్యవస్థను పటిష్ట పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి మహేందర్‌రెడ్డి, రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్‌స్టేషన్లకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఉండేది. తుప్పు పట్టిన పోలీసు వాహనాలు, అపరిశుభ్రంగా పోలీస్‌స్టేషన్‌లో సరైన వసతులు లేక పోలీసు అధికారులు సైతం ప్రజలపై విరుచుక పడుతున్న పరిస్థితి ఉండేది. పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం బాధితులు వెళ్తే పోలీసుస్టేషన్‌లో ఎవరిని కలవాలని, ఫిర్యాదు ఎక్కడా చేయాలనే తెలియని పరిస్థితిలో ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేక పోతుండేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను పూర్తిగా మెరుగులు దిద్దారు. పోలీస్‌స్టేషన్‌కు ప్రజలు వెళ్లేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లో అన్ని వసతులు కల్పించడంతోపాటు ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా సుందరీకరణగా మార్చారు. నెలకు పోలీస్‌స్టేషన్‌కు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం లక్ష రూపాయలు మంజూరు చేస్తోంది.

సుందరీకరణగా పోలీస్ స్టేషన్లు
పోలీస్‌స్టేషన్‌లో ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు ఫిర్యాదుదారులు వస్తే కూర్చోవడానికి కుర్చీలు, మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ప్రజలు నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేసేందుకు సదరు పోలీసు అధికారి స్నేహ పూరిత వాతావరణంలో వారిని పలకరించి ప్రజల సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరించేలా మెలగాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్లను సుందరీకరణగా మార్చారు. గ్రీనరీ గార్డెన్, పూల మొక్కలను నాటించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో కూర్చునేలా ఆహ్లాదకరంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మార్పు చేశారు.

తనిఖీలు షురూ..
పోలీస్ వ్యవస్థను పటిష్ట పర్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. స్టేషన్లలో ఉన్న పరిస్థితి, సిబ్బంది పనితీరును డీజీపీ నేరుగా పరిశీలిస్తున్నారు. ఇటీవల ఆయన హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు 3 గంటలకుపైగా స్టేషన్‌లో ఉన్న ఆయన సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పేలా స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తూ అవసరమైన వసతులన్నీ సమకురుస్తుంటే క్షేత్రస్థాయిలో ఇంకా ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొందరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని డీజీపీనే స్వయంగా పోలీస్‌స్టేషన్లన పరిశీలిస్తున్నారు.

నేటి నుంచి జిల్లాలో డీజీపీ పర్యటన
పోలీస్‌స్టేషన్లలో ప్రజలను పోలీసులు వారి సమస్యల పరిష్కారం కోసం వస్తే ఆప్యాయంగా పలకరిస్తున్నారా.. లేదా.. అని డీజీపీ రాష్ట్రంలోని మొదట హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్లలో కొన్ని పోలీస్‌స్టేషన్లను పరిశీలించారు. నేటి నుంచి జిల్లాలోని పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసేందుకు డీజీపీ ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు. కొందరు పోలీసు అధికారులు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని డీజీపీనే స్వయంగా పోలీస్ స్టేషన్లను పరిశీలిస్తున్నారు. ఏ జిల్లాకు పోలీస్ బాస్ ఎప్పుడొస్తారోనని పోలీసులు ఇప్పటికే పీఎస్‌లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ ఆవరణలో చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకుంటున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...