అధిక దిగుబడులు పొందవచ్చు


Sun,July 14, 2019 01:45 AM

మదనాపురం : మామిడి సాగులో మెళుకువలు పాటీస్తే అధిక దిగుబడులు పొందవచ్చని కేవీకే ఉద్యాన శాఖ శాస్త్రవేత్త సురేశ్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉద్యాన శాఖ శాస్త్రవేత్త సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం నాగన్నయాదవ్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా సురేశ్‌కుమార్ మాట్లాడుతూ పండ్ల చెట్లకు సరియైన ఆకారం రావటానికి కత్తరింపులు చేయవలసి ఉంటుందని తెలిపారు. కత్తరింపులలో ముఖ్య పద్ధతులైన సెంట్రల్ లీడర్ పద్ధతి, ఓపెన్ సెంటర్ పద్ధతి, మాడిఫైడ్ లీడర్ పద్ధతులను క్షుణ్ణంగా వివరించారు. కొమ్మల కత్తరింపుల వలన చెట్టులో కలిగే మార్పులు, కత్తరింపుల ముందు, తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు తెలియజేశారు. చిన్నతోటలు, పెద్దతోటలలో కత్తరింపుల యాజమాన్యం, వివిధ పండ్ల మొక్కలైన మామిడి, చీని, జామ, దానిమ్మ, సపోట, రేగులలో కత్తిరింపులను రైతులకు వివరించారు. సినీయర్ శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ మామిడిలో సంక్రమించే తెగుళ్లు వాటి నివారణ పద్ధతులను రైతులకు తెలియజేశారు. బూడిదతెగుళ్లు, వేరుకుళ్లు, ఆంత్రక్నోస్ మచ్చతెగుళ్లు, బ్యాక్టీరియా, ఆకుపచ్చ తెగులు వంటివి మామిడిలో సంక్రమించే రోగాలను రైతులకు వివరించారు. వీపనగండ్ల ఉద్యాన శాఖ అధికారి క్రిష్ణయ్య మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందుతున్న ప్రయోజనాలు, మామిడి సాగులో మెళకువలను వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది వెంకటయ్య, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలకు చెందిన 40 మంది రైతులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...