రిజర్వేషన్లపై ఉత్కంఠ!


Fri,July 12, 2019 03:17 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : బల్దియా రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొన్నది. వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు రిజర్వేషన్లపైనే దృష్టి సారిస్తున్నారు. మరనోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధిత అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా జాబితా ప్రచురణ, కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో అధికారులు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఆయా పురపాలికల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 49 వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, కులాల వారీగా జాబితాను మున్సిపల్, ఆర్డీవో, తాసిల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. రెండు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం ఇచ్చారు. గురువారం మహబూబ్‌నగర్ పురపాలికకు సంబంధించి ఒక ఫిర్యాదు మాత్రమే అందింది. ఒక్కో వార్డులో 2900 నుంచి 3800 వరకు వార్డుల్లో ఓటర్లు ఉన్నారు. 14న తుది జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ వెలువడే అవకాశం ఉంది. కాగా, మున్సిపల్ కమిషనర్ సురేందర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితా, కులాల వారీగా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని, శుక్రవారం సాయంత్రం వరకు ఇందుకు అవకాశం ఉందని సూచించారు.

1,65,496 మంది ఓటర్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 1,65,496 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఇటీవల ఎంపీ ఎన్నికలకు ముందు ఓటర్లుగా నమోదు చేసుకున్న వారే. పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. పురపాలిక సంఘంలో ఓటు హక్కు లేకపోయినా, ఒక వార్డు నుంచి మరో వార్డుకు మార్చుకునే వారు ఓటరు జాబితాలో నమోదు చేసుకొని త్వరలో జరగబోయే పురః ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటుహక్కు లేని వారు www.ceo telangana వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కును పొందవచ్చు. లేదా తాసిల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, మరోమారు ఓటు హక్కుకు అవకాశం ఇవ్వడంతో మున్సిపల్ ఎన్నికల్లో నిలబడాలనే ఆశావాహులు తమకు తెలిసిన వారిని ఓటర్లుగా నమోదు చేయించుకునే పనిలో ఉన్నారు.

మొదలైన ఎన్నికల వేడి
మున్సిపల్ ఎన్నికల నోటీఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తుండడంతో ఆయా వార్డుల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఒకవైపు మున్సిపల్ అధికారులు ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు ముమ్మరం చేసి ఎన్నికలకు సిద్ధమవుతుంటే, ఆయా వార్డుల్లో ఆశావాహులు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ తమను తాము ప్రచారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...